పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/592

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అంచు సతతము నే వినుతించుచున్న | కించిదనుకంపమున విలోకింప వహహ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

4


సీ.

శ్రీభవానీవర సితకంఠ హర వామ- | దేవ మహాదేవ దేవదేవ
దేవరాణ్ణుతసుస్వభావ భావజభంగ | భర్గ విరూపాక్ష భవ కపర్ది
శంకర సాధువశంకర శర్వ శ- | శాంకశేఖర నిష్కళంక వరద
శూలి సోమ కపాలమాలికాధర నీల- | లోహిత గిరిధన్వ త్రాహి యనుచు


గీ.

నహరహంబును నే మహామహుఁడు నుడువు | నతఁడు కైవల్యమొందుటే యబ్బురంబ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

5


సీ.

కామగర్వవిఫాల సామజాజినచేల | సామగానవిలోల శరణు శరణు
పుంగవాజానేయ సంగరాజేయ భు- | జంగతల్పసహాయ శరణు శరణు
నిత్యనృత్యవినోద భృత్యతత్యాహ్లాద- | సత్యవచోమోద శరణు శరణు
సాంద్రకృపాపాంగ చంద్రికాభనిభాంగ | చంద్రసూర్యరథాంగ శరణు శరణు


గీ.

సంతతద్యోధునీజూట శరణు శరణు | సభ్యరక్షానిరాఘాట శరణు శరణు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

6