పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

532

భక్తిరసశతకసంపుటము


మ.

పరమానందము భక్తకోటికి నిడ న్బౌద్ధస్వరూపుండవై
దురితధ్వాంతదివాకరుండ వగుచు న్దుర్వాదముల్ మాన్పి సు
స్థిరచిత్తంబున నిన్నుఁ గొల్చు మనుజశ్రేణి న్సదా ప్రోచుచున్
గరిమన్ లోకము నేలుచుంటివి కటాక్షం బొప్పఁగన్ మాధవా.

59


మ.

కలికి స్వాకృతిఁ దాల్చి దుష్టజనసంఘధ్వంసముం జేయ ని
స్తులదోర్విక్రమము న్వహించి విలసత్తుంగాశ్వరాజంబుపై
లలిఁ గూర్చుండి కరంబునందుఁ గరవాలం బూని తద్దుష్టని
ర్దళనంబుం బొనరింతు వెంతయు జగత్సంరక్షకా మాధవా.

60


శా.

ఈవే తండ్రివి తల్లి వీవె చెలి వీవే ప్రాణమిత్రుండవున్
నీవే నా కిఁక సద్గురుండ వయిన న్నీవే సహాయుండవున్
నీవే యాపదలందు రక్షకుఁడవు న్నీవేసుమీ భ్రాతవున్
నీవే గావున నిన్ను భక్తి గొలుతు న్నిక్కంబుగన్ మాధవా.

61


శా.

నీమందస్మిత మాసుధాంశుకిరణానీకస్ఫురచ్చంద్రికా
భూమాభిఖ్యఁ దిరస్కరించి కలశాంభోరాశి సద్వీచికా
స్తోమంబు న్నిరసించి భక్తులకు నస్తోకానుకంప న్సదా
క్షేమంబు ల్గలుగంగఁజేయు ననుచున్ గీర్తించెదన్ మాధవా.

62


శా.

నీనేత్రంబులశోభ యెవ్వనికి వర్ణింపం దరంబౌనె ల