పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాధవశతకము

531


మ.

బలిదైత్యాగ్రణి వంచనంబు నొనరింప న్వామనాంగుండ వై
యిల మూడంఘ్రులుమాత్ర మీ వడిగి యీపృథ్వీదివు ల్జాలమిన్
దలపై వానినిఁ ద్రొక్కి నాగభువనస్థానంబునన్ జేర్చితౌ
జలజాతాక్ష భవత్ప్రభావ మెఱుఁగ న్శక్యంబె శ్రీమాధవా.

55


మ.

జమదగ్న్యాత్మభవుండవై సకలరాజన్యాళియు న్నీదు క్రో
రోధమహాగ్నిస్ఫుటకీలకు న్శలభబృందంబై చన న్వారిర
క్తముచేతం బితృదేవతర్పణములం గావించి హర్షించి తీ
వమర న్నీయవతార మద్భుతకరం బయ్యెంగదా మాధవా.

56


మ.

శమదాంత్యాదులఁ బూని పంక్తిరథ కౌసల్యాతనూజుండవై
ప్రమథాధీశధనుస్సుఁ గూల్చి యపు డావైదేహిఁ బెండ్లాడి దు
ర్దములౌ రావణకుంభకర్ణులను యుద్ధంబందుఁ జక్కాడి యీ
క్షమ నిష్కంటకఁ జేసినాఁడవు సురల్ శ్లాఘింపఁగన్ మాధవా.

57


మ.

యదువంశంబు ముదంబు నొంద బలరామాఖ్యుండవై రేవతీ
మదిరాక్షీమణిఁ బెండ్లియై ముసలముం బల్లాంగలం బూని దు
ర్మదుఁడైనట్టి ప్రలంబరాక్షసునిఁ బోర న్దున్మి కాళిందియన్
నది మర్దించినవాఁడ వీవె జగదానందప్రదా మాధవా.

58