పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాధవశతకము

527


మ.

అల నందుండు నిజాత్మజుం డవని నీకత్యంతముం బ్రేమ జొ
బ్బిలఁగ న్భూషలలంకరింపఁగని సంప్రీతుండవై గొల్లపి
ల్లలతోడ న్విహరించినాఁడవు సులీల న్నీచరిత్రంబు ని
చ్చలు నాత్మందలపోయువారలకు నాశ్చర్యంబగున్ మాధవా.

39


శా.

పాకారాతి దురాగ్రహంబున శిలావర్షం బహోరాత్రముల్
వీఁకన్ దాఁ గురిపింప నంత మొదవుల్ భీతిల్ల గోవర్ధనా
ఖ్యాకం బైనగిరీంద్ర మెత్తి వెస నీవాగోపగోపాళి క
స్తోకం బైనసుఖం బొసంగితివి నీదోశ్శక్తిచే మాధవా.

40


మ.

పరకాంతాపరవిత్తనిస్పృహుఁడనై స్వామీ భవద్ధ్యానత
త్పరబుద్ధిన్ విషయోపభోగములపై వాంఛ న్విసర్జించి నీ
స్మరణంబే యొనరించుచుంటి నిఁక నీచారిత్ర మాలించుచున్
బరమానందము డెందమం దెనసి ని న్బ్రార్థించెదన్ మాధవా.

41


మ.

అల సాళ్వక్షితినేత సౌంభకవిమానారూఢుఁడై కిన్కచేఁ
గలహంబుం బొనరింపఁగా నతనిపైఁ గౌమోదకి న్నీమహో
జ్జ్వలశక్తిం బడవేసి గండణఁచితత్ప్రాణంబు లొక్కుమ్మడిన్
దొలఁగం జేసితి నీవ కావె సకలాప్తుల్ మెచ్చఁగన్ మాధవా.

42