పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

526

భక్తిరసశతకసంపుటము


శా.

నీపాదార్చన మెన్నిజన్మముల కేనిన్ జేయ నా కబ్బునే
నీపంచాక్షరమంత్రసజ్జపము నే నిత్యంబుఁ గావించెదన్
నీపాదానతభక్తబృందములతో స్నేహంబు గావింతు న
య్యా పద్మాక్ష కృప న్నను న్మనుపుమా యశ్రాంతమున్ మాధవా.

35


మ.

నినుఁ గన్నట్టిది యైనదేవకి పురంద్రీరత్న మైయొప్పున
వ్వనితాగర్భము పావనంబు నొనరింపం బుట్ట మున్నామె నో
చిననోముల్ ఫలియింపఁజేసితివనన్ శ్రీకృష్ణరూపంబుతో
డను గోపాలకబాలురం గదిసి యాట ల్నేర్పితౌ మాధవా.

36


మ.

వసుదేవుండు తపోవిశేషములు పూర్వంబందుఁ జేయంగ సం
తసమొప్ప న్ఫలియించినట్టిఫల మితం డంచుఁ దా హృష్టమా
నసుఁడై ని న్నల నందగోపకునియింటన్ జేర్పఁ బుత్తెంచుచో
వసమై యామునతోయ మీ వరుగఁ ద్రోవంగూర్పదే మాధవా.

37


మ.

తనదుగ్ధంబుల నిచ్చి పెంచిన యశోదాదేవి పుణ్యాళి యిం
తని లెక్కింపఁగ శక్యమే యెవనికేన్ హస్తంబుతో దువ్వుచున్
నిను నాడించుచుఁ జంకఁబెట్టుకొని పానీయంబులం బోయుచుం
డినదై యర్మిలి ముద్దుఁబెట్టుకొనియె న్నే ర్పొప్పఁగన్ మాధవా.

38