పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/528

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుభమస్తు

అల్లంరాజు రంగశాయికవికృత

మాధవశతకము

మ.

శ్రీపీఠాపురమందు భక్తులను రక్షింపం దలంపూని త
ద్వ్యాపారంబులఁ జక్కఁజేయుచుఁ గిరీటాద్యుత్తమాలంక్రియల్
దీపింపన్ జిఱునవ్వు మోము దగఁ గుంతీదేవిచేతం బ్రతి
ష్ఠాపూజల్ గనియున్న నిన్ గొలిచెదన్ స్వామి హరీ మాధవా.

1


శా.

క్రూరుల్ చేసెడి దుష్టకృత్యములఁ బోఁగొట్టంగ శిష్టావళుల్
ప్రారంభించిన సాధుకృత్యములఁ గాపాడంగ నూహించి పొ
ల్పారన్ యాదవవంశమందు జననంబై మున్ను శ్రీకృష్ణుఁడన్
పేర న్వర్తిలినాఁడ వీవేకద సేవింతు న్నినున్ మాధవా.

2


మ.

తొలి ధర్మజ్ఞులు పాండునందనులకున్ దుర్యోధనుం డెన్నికొం
దలముల్ గూర్పదలంచినన్ భువి భవత్కారుణ్యయుగ్వీక్షణం
బులచే నయ్యవి గీటణం బగుచు శుభంబుల్ వారి కెల్లప్పుడున్
గలిగెన్ గావున నీవు సాధుజనరక్షన్ జేయుదౌ మాధవా.

3