పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/526

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

మాధవశతకమును వ్రాసినది అల్లంరాజు రంగశాయికవి. ఈయన బహుగ్రంథనిర్మాతయు సుప్రసిద్ధకవియునగు అల్లంరాజు సుబ్రహ్మణ్యకవివర్యుని కుమారుఁడు. ఉభయభాషాకవి. అవధానవిధాననిపుణుఁడు. ఈకవి వ్రాసినయాంధ్రీకరణమగు చంపూరామాయణమువలన నీయన ఆరామద్రావిడబ్రాహ్మణుఁడనియుఁ బీఠికాపురసమీపస్థమగు చేబ్రోలు నివాసి యనియుఁ దెలియుచున్నది.

మాధవశతకము నీకవి ప్రౌఢవయస్సునందు రచించెను. రచనకాలము శాలివాహనశకాబ్దములు 1837 అనుటచే శతక మిప్పటికిఁ బదిసంవత్సరముల క్రిందటఁ బూర్తిచేయఁబడినటుల స్పష్టమగుచున్నది. ఈశతకము పీఠికాపురవాస్తవ్యుఁడగు కుంతీమాధవస్వామి కంకితముగా రచింపఁబడినటులఁ దొలిపద్యమువలనఁ దెలియనగును. ఈశతకమునందు శ్రీకృష్ణలీలలు విపులముగా నభివర్ణింపఁబడినవి. శతకకర్త జీవత్కవియు విమర్శనిపుణుఁడును నవయుగమున నున్నవాఁడును నగుటచే నీశతకము నాగరకులకు రుచించునటుల భావసమన్వితముగ వ్రాసెను.