పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాజశేఖరశతకము

449


చ.

హరియె హరుండు శ్రీధరపురారుల కైక్య మటంచు వేదముల్
మొర లిడుచుండఁగా వినుచు మూఢత భేదము సేయ నేల దు
ర్భరమగునయ్య విద్య నెడవాపి పరాత్పరతత్వ మూను సు
స్థిరమతిఁ దా సుఖించును సుధీజనతాదర రాజశేఖరా.

50


చ.

తనువు మనంబు ప్రాణములుఁ దద్దయు నింద్రియజాల మైక్యము
న్దనరఁగఁ జేసి భక్తిఁగొని తావకపాదసరోజచింతనం
బునఁ గడుమోద మొందు ఘనపుణ్యుఁ డొనర్చిన సర్వధర్మముల్
బొనరఁగ నీ కొసంగుచును బొందు భవద్గతి రాజశేఖరా.

51


ఉ.

పావనతావకాంఘ్రియుగభావనయ న్వరసూర్యదీప్తి లే
కేవరుసన్ దమఃపటల మేగును గేవలశబ్దబోధచేఁ
బోవు నదెంతయు న్విరతిఁ బొందునె చీఁకటి దీపవార్తచేఁ
గావున నీదుభక్తి గొనఁ గావలె శ్రీకర రాజశేఖరా.

52


చ.

వ్రతములు దేవపూజ లుపవాసములున్ బహుదానధర్మముల్
గ్రతువులు తీర్థయాత్రలును గన్గొన వేదపురాణశాస్త్రముల్
గుతుకముతో భవత్పదముఁ గోరి భజించు మహాత్ముఁ బ్రోవ నీ
యతులితభక్తిఁ బోలవు దయాకర శ్రీకర రాజశేఖరా.

53