పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

మానసబోధశతకము చిత్తబోధశతకములమూలమున ఆంధ్రలోకమునకుఁ జిరకాలపరిచితుఁడైయున్న తాడేపల్లి పానకాలుకవి యీపార్థసారథిశతకమును రచించెను. ఇతఁ డింతియగాక రుక్మిణీపతిశతకము మంగళాద్రినృసింహశతకము లక్ష్మీశతకము లోనగుగ్రంథములు గావించియున్నాఁడు. పానకాలుకవి నియోగి బ్రాహ్మణుఁడు; శ్రీవత్ససగోత్రుఁడు. కవినివాసము కొండవీటిసీమలోనిదియుఁ గృష్ణాతీరస్థము నగు తాడేపల్లి. ఇట కవివంశీయులు నేఁటికిని గలరు. కవిజీవితమును గూర్చినయంశము లట విశేషించి తెలియరావుగాని కవి యిప్పటికి నూఱుసంవత్సరములక్రింద జీవించియుండెననియు నితఁడు వైద్యమున మిగులఁ బేరుగాంచినవాఁ డనియుమాత్రము తెలిసినది. ఇతఁడు వైద్యనిపుణుఁ డనుటకు నేత్రదర్పణమే తార్కాణము కాగలదు.

క. పదిరెండుపర్వతంబులు
     విదితంబుగ నదులు రెండు విభుఁడు నృసింహుం
     డదనైనదుర్గ మొక్కటి
     పదపడి ముదమలరు తాడెపల్లి ధరిత్రిన్.