పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

368

భక్తిరసశతకసంపుటము


మ.

అలుకా పిల్వఁగఁ బల్కవే మిది పరాకై యుంటివా లేక బీ
దలమాట ల్చెవినాటవా నెనరు లేదా కాక కార్పణ్యమా
బలువా ప్రోచుట కెవ్వరున్ మనవి దెల్పంజాలరా తీఱదా
తెలియంజెప్పు బిఱాన నెందు కిఁక సందేహంబు సీతాపతీ.

71


మ.

ధరణీపుత్రి నిజాంకపీఠమున నుద్యద్భక్తి వాతాత్మజుం
డరయ న్రోలను బార్శ్వభాగముల నాహ్లాదంబున న్సోదరు
ల్సొరది న్నల్లడలందు నంద మెసఁగ న్సుగ్రీవనక్తంచరే
శ్వరతారాసుతఋక్షనాయకులు గొల్వన్ రత్నపీఠంబునన్
గర మొప్ప న్జెలువొందు నిన్నుఁ గన నెన్నం డబ్బు సీతాపతి.

72


మ.

కలకాలంబును జీతబత్తెములకై కాంక్షింప కేఁ గొల్వ నీ
పలుకే బంగరుగాఁగఁజేసితివి యేపాటింక చా లెప్పుడో
నిలువం బెట్టక ప్రోతువా యిఁకను కానీ యెట్లు తప్పించుకోఁ
గలవో చూచెద బంటుపంత మిది భక్తత్రాణ సీతాపతీ.

73


శా.

సామంతుండవె శాంతమూర్తివె కృపాస్వాంతుండవే ధాతవే
సామాన్యుండవు గావు నాదుదురదృష్టం బెట్టిదో నీకయో!
నామీఁదం గృప బుట్టనీదు నినుఁ బోనాడంగరా దింక సు
త్రామస్తుత్యపదారవిందయుగ భక్తత్రాణ సీతాపతీ.

74