పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈశతకము రచించినకవి శిష్టు సర్వశాస్త్రి. ఈయన సర్వకామదాది మహాప్రబంధములు వ్రాసిన షడ్దర్శనీపారగులగు శ్రీశిష్టు కృష్ణమూర్తిశాస్త్రిగారి కుమారుఁడు. వాసిష్ఠగోత్రుఁడు, ఆపస్తంబసూత్రుఁడు. కాసలనాటి వైదికబ్రాహ్మణుఁడు.

శ్రీ శిష్టు కృష్ణమూర్తికవి సంస్కృతాంధ్రములయందు బహుగ్రంథములను రచించి యాకాలమున సుప్రసిద్ధములై యున్న మాడుగుల, శ్రీకాళహస్తి, పిఠాపురము, కిర్లంపూడి లోనగు సంస్థానములయం దమిత గౌరవసత్కారముల నంది యనన్యసాధ్యమగు ప్రజ్ఞావిశేషముచే దిగ్గజమువలె విజృంభించి చరించినటులఁ దెలియవచ్చుచున్నది. ప్రకృతశతకకర్తయు కృష్ణమూర్తిశాస్త్రి గారిపుత్రుఁడు నగు నీసర్వశాస్త్రిగారు తండ్రియంత లోకవిఖ్యాతవిద్వాంసులు కాకపోయినను ఉభయభాషలలో సరసమగు సాహిత్యము, అవధాననైపుణ్యము, గ్రంథరచనాప్రతిభ కలవారై కొంతకాలము కాళహస్తిసంస్థానాధీశ్వరు లగు శ్రీదామెర వేంకటపతి రాజన్యుని యాస్థానమునం దాదరసత్కారముల నొందుచు నుండెను.