పుట:2015.390519.Shashamka-Vijayamu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

శశాంక విజయము


శ్రీరామాహృదయేశుఁ డాఘనున కేరీతిన్ దగన్ బుట్టితో
క్షీరాంభోనిధికిన్ హలాహలముమాడ్కిన్ పాంథవిధ్వంసకా!

88


చ.

బలిమి వియోగవర్గముల బాధలఁ బెట్టెడు నిర్ధయాత్మ! నీ
దళములు చెట్లపా లయి శతాంగ మరూపకమై శిలీముఖం
బులు కడువాఁడి హేయమయి పూనినయిక్షుశరాసనంబు ని
ష్ఫలమయి పోయినం గద శుభం బగు ధారుణి కెల్ల మన్మథా!

89


గీ.

శివుఁడు నిను జీవమాత్రావశిష్టుఁ జేసె
నన్నఁ గడముట్టఁ దునుమ క ట్లగుటఁ గాదె
తనువు సగమైన భంగంబు తడఁబడంగ
జంగమై పోయె శత్రుశేషంబు దగునె.

90


ఉ.

మత్తతవిప్రయోగిజనమర్దనుఁ డైనప్రసూనధన్వికిన్
గత్తు లొసంగినట్టిజనఘాతుకమాధవనామధేయ మ
త్యుత్తమ మేగతిం గలిగెనో గద నీకు సుధాఖ్యగారకున్
హత్తినలీల రక్కసున కంచితపుణ్యజనాఖ్యయుం బలెన్.

91


గీ.

మధుపగుణశాలితో మైత్రి మహి నొనర్చి
పైకముల గూర్చి పంచమభంగి పేర్చి
రంతు లిడియెదు జాతి రవంత యెన్న
నుచితగతి లేదు కాసంత యోవసంత!

92


ఉ.

బాపురె పాంథభంజన! ప్రభంజన! యామ్యదిగంతరంబునం
గాపుర మీవు సల్పుటలు కాలునికిన్ జనపీడనంబు లం
కాపురి నుండుదైత్యులకుఁ గర్కశభావము చందనాద్రిశృం
గోపరిపన్నగావళికి నుగ్రత నేర్పును గాదె నిచ్చలున్.

93


చ.

ఇల సుమనోగుణంబు విరియించెదు ప్రాణ మటంచు నెంచు మ
మ్మలయఁగఁ జేసె దౌర మలయానిల! యెంతటిమాంద్య మెంతపాం
సులగతి గర్భమందె బలసూదనుఁ డాగతి మట్టుఁబెట్టఁగా
నిలిచె జగంబు కానియెడ నింగియు నేలయు నాక్రమింపదే.

94


క.

అవునా ప్రేరేప మనో
భవు నాపై కలితతామ్రపర్ణీసదనో
పవనా! పధికోత్సవనా
పవనాపవనాధిచలదుపవనా! పవనా!

95