పుట:2015.390519.Shashamka-Vijayamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

65


మోముఁ జూచిన శశిరేఖమోడి యమరె
మాటపోడిమిఁ జూచిన మంజుఘోష.

50


ఉ.

పన్నగకన్యల న్మనుజభామల యక్షసరోరుహాక్షులన్
గిన్నరసన్నుతాంగులను ఖేచరభామల సిద్ధకాంతలన్
జన్నపువిందుసుందరులఁ జారణవారణరాజయానలన్
గన్నది కాదె దీనిమెయి కైపులు వైపులు చూడ మెచ్చటన్.

51


గీ.

చూడకుండంగఁ గూడ దీసుదతిసొబగు
చూచినంతనె మదిలోనఁ జొచ్చెఁ బాళి
యేమిటికి వచ్చె నిచటికి నిందువదన
యెట్టులున్నదొ యింక రతీశ్వరాజ్ఞ!

52


క.

అని చింతించుచు నుండఁగ
వనజాయతనేత్ర వచ్చి వానిసమీపం
బునఁ గూర్చుండెను మేనం
గొన బగుజవ్వాదితావి గుబులుకొనంగన్.

53


గీ.

వచ్చి కూర్చున్న వాఁడు నవ్వన్నెలాడిఁ
జూచి ధృతి గుంది యందంద చోద్య మంది
తనువు పులకింపఁ జిత్తము తత్తరింప
వివశతను జెంది మగుడ వివేక మొంది.

54


క.

ఏటికి వచ్చితి నే నీ
తోఁటకు నిం దేల వచ్చెఁ దోడ్తోడనె యీ
బోటి మరుండు మనోధన
పాటచ్చరుఁ డేమిపాటుఁబడ నున్నాఁడో!

55


క.

నిలువర మయ్యెను మును నా
తలఁచినయది మది విరాళి తహతహపడి తా
నెలమిన్ బైకొనవచ్చెను
గలకంఠుల నమ్మరాదుగా కల నైనన్!

56


క.

ఐనను గానీ నాచే
నైనగతి న్నిలిపి చూతు ననుచిత మగుచో
నౌనా మోహం బనుచున్
మానవతం జూచి న్యాయమార్గము దోఁపన్.

57