పుట:2015.390519.Shashamka-Vijayamu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

109


సకలజనపూజ్యుం డైనయాచార్యుభార్య
బలిమిఁ బట్టితి వింతపాపంబు గలదె.

174


క.

అంతట బోవక నీ వ
య్యింతిని నెత్తుకొని వచ్చి హృదయంబున నొ
క్కింతయు వెఱవవు గర్వా
క్రాంతుఁడ వై యెంత కండకావరమొ కదా.

175


క.

క్షితిలో స్త్రీవ్యసనంబే
యతిగర్హిత మందుపైఁ బరాంగన యాపై
నుతశీలుఁ డైనగురుసతి
పతివ్రత నీ వాచరింపఁ బాడియె నీకున్.

176


చ.

అరయక మించి చేసితివి యౌవనగర్వముచే నకృత్య మి
త్తఱి మును లైన నీదుతలిదండ్రులపై మొగమాట ని మ్మహ
త్తర మగుతప్పుం గాచితిమి దా యడ లేటికి నిప్పు డైన నా
గురుశరణంబు సొచ్చి యళికుంతల నిచ్చుట మేలు కానిచోన్.

177


క.

ప్రకట మగుసంగరంబున
నొకక్షణమున వీపుచర్మ మొలిపించెద యా
మిక వేయించెద నిదె మా
మకభుజదంభోళిచండిమం బెఱుఁగ వొకో.

178


మ.

అని దిక్పాలకు లందఱు న్వినఁగ బంభారాతి పల్కెం గడుం
గినుక న్వారలు నిట్లనే యనిరి తీక్ష్ణీభావ మొప్ప న్మహా
మునులెల్లన్ శపియింపఁగాఁ దలఁచి రున్మూలంబుగా నాగ్రహం
బున సర్వామరసిద్ధసాధ్యులును గుంపు ల్గూడినా రెల్లెడన్.

179


క.

నా విని నునుమీసముపై
చే వైచి మొగంబునందు చిఱునవ్వును గో
పావేశంబును దోఁపఁగ
నావేలుపుదూతఁ జూచి యతఁ డిట్లనియెన్.

180


శా.

ఓహోహూ! పురుహూతుఁ డెంతటిగృహస్థో! యిట్లు దాఁ బల్క నీ
యూహాపోహము లెందుఁ బోయెనొకొ! ప్రత్యూషంబునం గోడియై
మోహోద్వృత్తి నహల్యం గూడునెడలన్ బోధింప నేనొల్ల ని
ట్లాహా! యొజ్జలపుచ్చకాయవిత మౌరా వేయు నిం కేటికిన్!

181