పుట:2015.390519.Shashamka-Vijayamu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

శశాంక విజయము


సుదతి యటంచు నుస్సురనుచున్ నలుదిక్కులు సూచి విభ్రమా
సదగతిఁ గంప మందు మదసామజకంపితభూరుహాకృతిన్.

134


మ.

అతఁ డారీతి నిజాంగన న్వెదకి దివ్యజ్ఞానదృష్టి న్నిశా
పతి గావించినకీడుగాఁ దెలిసి హా! పాపాత్మకుం డెంత దు
ష్కృతకర్మంబున కొగ్గె సిగ్గు కులముం జింతింపకే పుంశ్చలీ
స్థితిచే నీబలుజంత యెంత పనిఁజేసె న్నమ్మరా దెవ్వరిన్.

135


క.

ఏ కినిసి శపించిన నిపు
డాకులదూషకుఁడు గ్రుంగు నది యొకహెచ్చా
కోకారిని దండింపఁగఁ
బాకారికిఁ దెలిపి నేఁడ పరిమార్పింతున్.

136


క.

అని నిశ్చయించి మది న
య్యనిమిషదేశికుఁడు దుస్సహాగ్రహమతిచే
ననలునివితమునఁ గనలుచు
ననిలజవము మెఱయ నిలక నటు చని యెదుటన్.

137


క.

గంగం దరంగరవ మెస
గంగం బ్రవహించు నిన్ను గం గనుగొని యే
గంగం బురముల నెల్ల న
గం గలనిర్జరులపురి తగం గనుపట్టెన్.

138


సీ.

ఘనసుధర్మాస్థితుల్ ఘనసుధర్మస్థితు
        లన మహాభోగ మెం దనుభవింతు
రప్పరోజాతంబు లప్సరోజాతంబు,
        లనఁగ హేమాభిఖ్య లమరు నెందు
సురభి మరుత్పాళి సురభి మరుత్పాళి
        నా నెందుఁ జెందు మందారలీల
నాసత్యముఖ్యులు నా సత్యముఖ్యులు
        నా నెందుఁ గాంతు రానందనంబు


గీ.

సమరనాయక మణిలీల నమర నాయ
కమణి శచిమోవిముద్దులు గాంచు నెచట
విష్ణుపదభూషణం బన వెలయు నెద్ది
యట్టి యమరావతీపురి నతఁడు చేరి.

139