పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కొండవలె పెనిమి టుండగ
మిండని చవి మరిగి కడల మీఱుఁచుఁ దిరిగే
రండను యమపురిఁ జీల్తురు
కండలుగా కుందవరపు కవి చౌడప్పా.

60


క.

వగలాడి చెంత నుండిన
మగవానికి నూరకుండ మన సయ్యేనా
తగుసరసమ్ముల నాడక
ఖగపతిబల కుందవరపు కవి చౌడప్పా.

61


క.

వగలాఁడికి ముసలాతఁడు
మగడయితే దాని చింత మఱి యింతంతా
జగదీశుఁడు తా నెరుగును
ఖగపతిబల కుందవరపు కవి చౌడప్పా.

62


క.

సారములెవి సంసారికి
భారములెవి గోపురంబు ప్రతిమకు పిప్పిన్
సారములెవి గుడిసెకు ప్రా
కారములెవి కుందవరపు కవి చౌడప్పా.

63


క.

పులి నాకి విడుచు దైవము
గలనాటికి దైవబలము గలుగని వేళం
గలహించి గొఱ్ఱె కఱచును
గలియుగమునఁ గుందవరపు కవి చౌడప్పా.

64


క.

పాండవు లిడుములఁ బడరే
మాండవ్యుఁడు కొరతఁబడె మహి ప్రాకృత మె
వ్వండోపుమీఱి చనగన
ఖండితయశ కుందవరపు కవి చౌడప్పా.

65