పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవి చౌడప్ప

అధిక్షేప శతక కర్తలలో విలక్షణ మార్గము ననుసరించిన వారిలో కవి చౌడప్ప ప్రముఖుడు. ఈ కవి ప్రస్తుతించిన మట్ల అనంతభూపాలుడు, తంజావూరు రఘునాథ రాయలు అనువారు పదునేడవశతాబ్ది పూర్వార్థమున జీవించిరి. ఆత్మ సంబుద్ధి పరముగ నీతిహాస్య అధిక్షేప ధోరణిలో పద్య రచన చేయుటలో ఈతనికి వేమన మార్గ దర్శకుడై యుండును. ఈ ఆధారము ననుసరించి చౌడప్ప పదునేడ శతాబ్ద్యంతమున జీవించి యుండెను.

చౌడప్ప కవి కుందవరము కరణము. ఈతని శతక పద్యములు పండిత పామర లోకమున బహుళ ప్రచారము నొందినవి. ఇతరాంశములతో పాటు అశ్లీలోక్తులు - బూతులు - ఈతని పద్యముల కట్టి ప్రశస్తిని కలిగించినవి. నగ్నసత్యమును నగ్నముగ చెప్పుటలో ఈతడు వేమనకు ఈడు జోడైనవాడు. చౌడప్ప రాజాస్థానము లందు సంచరించి పండిత కవుల సాహచర్యము నొందినవాడు. విశేష భాషాసాహిత్యజ్ఞాన సంపన్నుడు. కవిత్వ మాధుర్యమును సామాన్య ప్రజలకు ప్రసాదించిన మహానుభావుడు. కవిత్వము - దాని ప్రయోజనము-రసము-పాకము, కందపద్య రచన మున్నగు అంగములను గూర్చి ఈకవి తనకుగల అభిప్రాయములను స్పష్టముగా చాటినాడు.

చౌడప్ప చెప్పిన పద్యములు వేయికి మించి యున్నవని కొందరు పండితు లూహించిరి. కాని చౌడప్పశతకముగా ప్రకటింపబడిన ప్రతులలో దాదాపు రెండు వందల పద్యములు కలవు, అశ్లీలోక్తులు-బూతులు కల పద్యములను, అస్పష్టముగ నున్న వానిని పండితులు పరిష్కరించి నూరు, నూటపది పద్యములలో చౌడప్ప శతకమును ప్రకటించిరి. చౌడప్ప పద్యముల పరిష్కరణము జటిలమైన సమస్య. దీనిని గూర్చి అభిప్రాయ భేదము లెన్నియో కలవు. అశ్లీ