పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

తనకుం బద్యము లల్లి సత్కవులు నిత్యంబుం బ్రసంగింపఁగా
విని యొత్తుల్ దిను దాసరింబలె బయల్వీక్షించుచుం గానియై
న నొసంగన్ మదిలోఁ దలంపని మదాంధక్షోణిపాలుండిలన్
మునుమార్గంబు గ్రహింపఁగాఁగలడె రామా! భక్తమందారమా!

72


శా.

ధాటీపాటవ చాటు కావ్యరచనోద్యద్ధోరణి సారణీ
వాటీకోద్గతి సత్కవీశ్వరుఁడు నిత్యంబుం దమున్ వేఁడఁగా
వీటీఘోటక హాటకాదు లిడ రుర్విన్ నిర్దయాబుద్ధిచే
మాటే బంగారు నేటి రాజులకు రామా! భక్తమందారమా!

73


మ.

పలుమాఱుం ద్విజరాజు లొక్కటఁ దముం బాధింతురంచున్ విషా
నలఘోరాననముల్ముడుంచుకొని కానన్ రాక దుర్గస్థలం
బుల వర్తించుచు బుస్సు రందు రిల నాభోగేశు లెందైననున్
మలఁకల్మాని చరింపఁగాఁగలరె? రామా! భక్తమందారమా!

74


మ.

గడియల్ రెండిక సైచిరా వెనుకరా కాసంత సే పుండిరా
విడిదింటం గడె సేద దీర్చుకొనిరా వేగంబె బోసేసిరా
యెడపొద్దప్పుడు రమ్మటంచు సుకవిన్ హీనప్రభుం డిగతిన్
మడఁతల్వల్కుచుఁ ద్రిప్పుఁగాసిడక! రామా! భక్తమందారమా!

75


మ.

బలరాజన్యుఁడు ధూర్తకాకవిఁ గనంగంపించి విత్తంబు దా
నలఘ ప్రక్రియ నిచ్చు సత్కవివరున్ హాస్యంబు గావించు నౌ
నిల బర్బూరము గాలివానఁబడుగాఁ కింతైనఁ గంపించునే
మలయోర్వీధర మారుతంబునకు రామా! భక్తమందారమా!

76


శా.

కాయస్థుల్గణికా జనంబులు తురుష్క శ్రేణులున్ దుష్టదా
సెయుల్ వైద్యులున్ బురోహితులు దాసీభూతముల్ గాయకుల్
బోయల్ గొందఱు లోభిభూవరు ధనమున్ సంతతంబున్ మహా
మాయాజాలము పన్ని లాగుదురు రామా! భక్తమందారమా!

77