పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అహితార్తుల్ వెడఁబాయు లేము లెడలున్ వ్యాధుల్ దొలంగు న్నవ
గ్రహ దోషంబులు శాంతిఁబొందుఁ గలుషవ్రాతంబు కాఱున్ శుభా
వహమౌ తావక దివ్యనామ మెలమిన్ వాక్రుచ్చినన్ ధాత్రిపై
మహితోద్దండతర ప్రతాపగుణ రామా! భక్తమందారమా!

24


మ.

గర్గాగస్త్యవసిష్ఠ శుక మార్కండేయ గాధేయులం
తర్గాఢాధిక శత్రుశిక్షణ కళాధౌరేయుతాబుద్ధి సం
సర్గ ప్రక్రియ ముమ్ముఁ గొల్తురుగదా క్ష్మాకన్య కోరోజస
న్మార్గస్ఫాయ దురఃకవాటతట! రామా! భక్తమందారమా!

25


మ.

అకలంకాయుత భోగభాగ్యదము నిత్యానంద సంధాన హే
యుక మాభీలతరాఘమేఘ ఘనవాతూలంబు ముక్తిప్రదా
యక మత్యంత పవిత్ర మెంచ నిల నాహా! తారకబ్రహ్మ నా
మక మంత్రంబు భళీ! భవన్మహిమ! రామా! భక్తమందారమా!

26


మ.

ఇనుఁడద్దంబగు నగ్నినీరగు భుజగేంద్రుండు పూదండయౌ
వనధుల్ పల్వల పంక్తులే జలధరాధ్వం బిల్లెయౌ రాజయో
గ నిరూఢస్థితిఁ దావకీనపదయుగ్మం బెల్లకాలంబు ప్రే
మ నెదం బూని భజించు ధన్యులకు రామా! భక్తమందారమా!

27


మ.

ముద మొప్పార నిరతరంబు బలవన్మోక్షప్రదామేయభా
స్వదుదం చ్ఛపదంఘ్రితామరస సేవాసక్త చిత్తంబు దు
ర్మదులం జేరునె పారిజాత సుమనోమత్తద్విరేఫంబు దా
మదనోర్వీజము చెంతకుం జనునె రామా! భక్తమందారమా!

28


మ.

ఖండించున్ బహుజన్మసంచిత చలద్గాఢోగ్ర దోషావలిం
జండప్రక్రియ శైలజావినుత భాస్వచ్చారు దివ్యన్మహో
ద్దండ శ్రీ భవదీయనామ మిలమీఁదన్ భూతభేతాళ కూ
ష్మాండద్రాత ఘనాఘనశ్వనన రామా! భక్తమందారమా!

29