పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

రఘు వంశాంబుధి పూర్ణచంద్ర! విలసద్రాజన్య దేవేంద్ర! నా
యఘ సంఘంబులఁ బాఱఁద్రోలి భవదీయామేయ కారుణ్యదృ
ష్టి ఘన ప్రక్రియఁ జూచి యేలుకొనుమా! సేవింతు నత్యంతమున్
మఘవ ప్రస్తుత సద్గుణాభరణ! రామా! భక్తమందారమా!

12


మ.

గణుతింతున్ భవదీయ సద్గుణ కథల్ కౌతుహలం బొప్పఁగాఁ
బ్రణుతింతున్ నచరాచరాదిక మహా బ్రహ్మాండ భాండచ్ఛటా
గణితప్రాణిజనాంతరాత్మవని వేడ్కన్ సతతంబున్ నభో
మణివంశాంబుధి శీతభాను! రఘురామా! భక్తమందారమా!

13


మ.

సారసారవిచార! ధీరజనతా సంరక్షణోదార! స
త్కారుణ్యాకరమూర్తి వంచు నెద నత్యంతంబు నీ దివ్యశృం
గారగా పదారవిందములు వేడ్కన్ గొల్తు నన్ బ్రోవుమీ
మారీచ ప్రమదప్రహారశర! రామా! భక్తమందారమా!

14


మ.

మిహికాంళూపమ సుందరాననముతో మే లీను కందోయితో
నహిజిద్రత్న వినీల విగ్రహముతో నంచ త్కిరీతంబుతో
విహగాధీశ్వరు నెక్కి నా యెదుటికిన్ విచ్చేయవే యోపితా
మహా సుత్రామ మఖామర ప్రణుత! రామా! భక్తమందారమా!

15


శా.

కంజాత ప్రభవాండ భాందచయ రంగచ్చేతనాచేతనా
ళిం జెన్నారఁగఁ బ్రోదిసేతు వని హాళిన్ ధీజనుల్ దెల్ప హృత్
కంజాతంబున మిమ్ముగొల్తు ననువేడ్కన్ వేగ రక్షింపుమీ
మంజుశ్రీకరుణా కటాక్షమున రామా! భక్తమందారమా!

16


మ.

తళుకుం బంగరు కామగుబ్బ గొడుగందంబొప్ప శత్రుఘ్నుఁడ
ర్మలి బట్టన్ భరతుండు చామరము గూర్మి న్వీచఁగా లక్ష్మణుం
డలదుం దూపుల విల్లుదాల్పఁ గపి సేనాధీశ్వరుల్ గొల్వ ని
ర్మల లీలం గొలువుండు నిన్ దలఁతు రామా! భక్తమందారమా!

17