పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

రాలన్ దైలము తీయవచ్చు భుజగవ్రాతమ్ముల న్బేర్లఁగా
లీల న్బూనఁగవచ్చు నంభోనిధి హాళి దాఁటఁగావచ్చు డా
కేల న్బెబ్బులిఁ బట్టవచ్చు విపినాగ్ని న్నిల్పఁగావచ్చు మూ
ర్ఖాళిం దెల్పఁ దరంబె యేరికిని? భర్గా! పార్వతీవల్లభా!

96


శా.

ఆఁకొన్నప్పుడు వంటకంబయిన బియ్యంబైన జావైనఁగూ
రాకైన న్ఫలమైన నీరమయినన్ హాలింగల ట్లిచ్చుచున్
జేకోనౌఁ బరదేశులం గృహులకు న్సిద్ధంబు గావింప ఛీ!
కాకున్న న్మరి యేఁటికొంప లవి? భర్గా! పార్వతీవల్లభా!

97


మ.

మడతల్వల్కునృపాలుతోఁ బలుమాఱున్మారాడుపెండ్లాముతోఁ
జెడుజూడం బ్రచరించునాత్మజునితోఁ జేట్పాటుగోర్లెంకతో
బొడవంజూడఁగవచ్చు కార్మొదవుతోఁ బోరాడుచుట్టంబుతోఁ
గడతేరం దరమా గృహస్థునకు? భర్గా! పార్వతీవల్లభా!

98


శా.

కాకి న్శాశ్వతజీవిగా నునిచి చిల్క న్వేగ పోకార్చి సు
శ్లోకుం గొంచెపుటేండ్లలోఁ గెడపి దుష్టుంబెక్కునాళ్లుంచి య
స్తోకత్యాగి దరిద్రుఁ జేసి కఠినాత్మున్ శ్రీయుతుంజేయి నా
హా! కొంకేదిఁక నల్వచెయ్వులకు? భర్గా! పార్వతీవల్లభా!

99


మ.

ధరలో నెన్నఁగ శాలివాహన శకాబ్దంబుల్దగ న్యామినీ
కరబాణాంగశశాంకసంఖ్యఁజెలువై కన్పట్టు (సౌమ్యా) హ్వ
య స్ఫురదబ్దంబున నిమ్మహాశతక మేఁ బూర్ణంబుగావించి శ్రీ
కరలీల న్బుధు లెన్న నీకిడితి భర్గా! పార్వతీవల్లభా!

100


మ.

ధనధాన్యాంబరపుత్త్రపౌత్త్రమణిగోదాసీభటాందోళికా
వనితాబంధురసింధురాశ్వ (మహితైశ్వర్యంబు) దీర్ఘాయువు
న్ఘనభాగ్యంబును గల్గి వర్ధిలుదు రెక్కాలంబుఁ జేట్పాటులే
క నరు ల్దీని బఠించిరేని భువి భర్గా! పార్వతీవల్లభా!

101