పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

హృద్వీథిం గనరుం దిరస్కృతియు బిట్టేపార నొక్కప్పుడున్
సద్వాక్యంబును దర్శనం బిడని రాజశ్రేణి కాశింతురౌ
"విద్వద్దండమగౌరవం" బనుస్మృతుల్ వీక్షింపరా దుర్నృపా
గ్రద్వారంబుల వ్రేలు పండితులు? భర్గా! పార్వతీవల్లభా!

78


మ.

అపవర్గం బొనగూడునో చిరసుఖాహ్లాదంబు చేకూరునో
జపహోమాధ్యయనార్చనాదిక మహాషట్కర్మముల్డించి దు
ష్కపటోపాయవిజృంభమాణధరణీ కాంతాధమాగారని
ష్కపట భ్రాంతి జరింతు నార్యు లిల భర్గా! పార్వతీవల్లభా!

79


మ.

అకటా! జిత్తెఁడుపొట్టకై కృపణమర్త్యాధీశగేహాంగణా
వకరక్షోణిరజశ్చటావిరతసం వ్యాప్తాంగులై క్రుంగి నె
మ్మొకముల్ వెల్వెలఁబాఱవ్రేలుదురదేమో యెందులంబోవనే
రక ధీమజ్జను లెంతబేలలకొ! భర్గా! పార్వతీవల్లభా!

80


మ.

అతిలోభిన్ రవిసూనుఁడంచుఁ గపటస్వాంతున్ హరిశ్చంద్రభూ
పతియంచున్ మిగులం గురూపిని నవప్రద్యుమ్నుఁడంచు న్మహా
పతితున్ ధర్మజుఁడంచు సాధ్వసమతిం బార్థుడటంచు న్బుధుల్
ప్రతివేళన్ వినుతింతు రక్కఱను భర్గా! పార్వతీవల్లభా!

81


మ.

జనసంస్తుత్యమహాప్రబంధఘటనా సామర్థ్యముల్ గల్గు స
జ్జను లత్యల్పుల దీనతం బొగడుదుర్ జాత్యంధతం జెందికా
కనువొప్పందమరెన్నఁడున్ "సుకవితా యద్యస్తిరాజ్యేనకి"
మ్మనువాక్యంబు వినంగలేదొమును? భర్గా! పార్వతీవల్లభా!

82


మ.

సుగుణోద్దామమహాకవింద్రఘటితా క్షుద్రప్రబంధావళుల్
జగదుద్దండపరాక్రమక్రమ విరాజద్భూమి భృన్మౌళికిన్
దగుఁగా కల్పుల కొప్పునే? కరికిముక్తాకాయమానంబుసొం
పగుఁగా కొప్పునే యూరఁబందులకు? భర్గా! పార్వతీవల్లభా!

83