పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అజినంబున్వృషఘోటియుం బునుకలు న్హాలాహలంబు న్మహా
భుజగంబు ల్శవభస్మముల్గొఱలఁగా భూతాళితో నుండియున్
ద్రిజగన్మంగళదాయకాకృతిఁ గడున్ దీపించు టబ్రం బహా
రజనీనాథకళాశిరోభరణ! భర్గా! పార్వతీవల్లభా!

42


శా.

భజించుంగద! ఘోరదుష్కృతతతిన్ భస్మత్రిపుండ్రంబుల
న్మంజుశ్రీలలితాక్షమాలికలఁ బ్రేమం బూని సద్భక్తి నీ
కుం జేమోడ్చు మహానుభావుఁ డెపుడుం కుక్షిస్థలప్రోల్లస
త్కంజాతప్రభవాండభాండచయ! భర్గా! పార్వతీవల్లభా!

43


శా.

శ్రీశైలంబునుగుంభఘోణమును గాంచీస్థానకేదారముల్
కాశీద్వారవతీప్రయాగములు నీలక్ష్మాధరావంతికల్
లేశంబున్ ఫలమీవు నిన్నెప్పుడు హాళింగొల్వలేకున్నచోఁ
గాశాకాశధునీఘనాభరణ! భర్గా! పార్వతీవల్లభా!

44


శా.

కావేరీ సరయూ మహేంద్రతనయా గంగా కళిందాత్మజా
రేవా వేత్రవతీ సరస్వతుల కర్థింబోవఁగా నేల నీ
సేవాసంస్మరణార్చనాదు లెపుడున్ సిద్ధించు మర్త్యాళికిన్
గ్రైవీభూతభుజంగమప్రవర! భర్గా! పార్వతీవల్లభా!

45


మ.

అరిషడ్వర్గముఁ దోలి సర్వహితులై యష్టాంగయోగక్రియా
పరులై గాడ్పుజయించిముద్రవెలయన్ బ్రహ్మంబునీక్షించివా
విరి సోహమ్మని యెంచుచుండెడిమహా వేదాంతులౌయోగిశే
ఖరులెల్లన్ మిముఁ గాంచుచుండ్రుగద? భర్గా! పార్వతీవల్లభా!

46


మ.

తలపోయన్ దిలజాలకాంతరమహా తైలంబుచందానఁ బూ
సలలో దారముపోల్కి నాత్మమయతన్ సర్వాంతరస్థాయివై
విలసల్లీలల నిండియుండుకొను నిన్వీక్షంపఁగా నేర్చువా
రలె ధన్యుల్ గద ముజ్జగంబులను భర్గా! పార్వతీవల్లభా!

47