పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నీచునకు ధనము గల్గిన
వాచాలత గల్గి పరుషవాక్కు లఱచుచున్‌
నీచ కృతి యగుచు మది
సంకోచము లేకుండఁదిరుగు గువ్వలచెన్నా!

30


అల్పునకు నెన్ని తెల్పినఁ
బొల్పుగ నిల్వవవి పేడబొమ్మకు నెన్నో
శిల్పపుఁ బనులొనరించినఁ
గోల్పోక యలారుచున్నె గువ్వలచెన్నా!

31


పిత్రాద్యైశ్వర్యముచేఁ
బుత్త్రులుఁ బౌత్రులును ధర్మబుద్ధిఁ జరింతుర్‌
చిత్రగతి నడుమఁగల్గిన
గోత్రం జిత్రగతిఁదిరుగు గువ్వలచెన్నా!

32


ధర నాడపడుచు సిరిచే
నిరతంబును బొట్టనించి నీల్గెడుమనుజుం
డొరులెఱుఁగకుండ ఱాతో
గురుతుగ నూఁతఁబడు టొప్పు గువ్వలచెన్నా!

33


గొల్లింటఁ గోమటింటను
దల్లియుఁ దండ్రియు వసింప దాను వకీలై
కళ్ళ మద మెక్కి నతనికి
గుళ్ళైనం గానరావు గువ్వలచెన్నా!

34


కాళ్ళం జేతులఁ జెమ్మట
నీళ్లవలె స్రవించుచుండ నిరతము మదిలోఁ
గుళ్లక వకీలు నని తన
గోళ్లం గొఱుకుకొను ద్విజుఁడు గువ్వలచెన్నా!

35