పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తెలిసియుఁ దెలియనివానికిఁ
దెలుపం గలఁడే మహోపదేశికుఁడైనన్‌
బలుకం బారని కాయను
గొలుపంగలఁ డెవఁడు పండ? గువ్వలచెన్నా!

12


చెలియలి భాగ్యము రాజ్యం
బుల నేలుచు జనుల ద్వేషమునఁజూచుచుఁ గ
న్నుల మత్తతఁ గొన్నాతఁడు
కొలనికిఁ గాపున్నవాఁడు గువ్వలచెన్నా!

13


అపరిమిత వాహనాదిక
మపూర్వముగనున్న యల్పుఁ డధికుండగునా?
విపులాంబర వాద్యంబులఁ
గుపతియగునె గంగిరెద్దు? గువ్వలచెన్నా!

14


పందిరి మందిరమగునా?
వందిజనం బాప్తమిత్రవర్గంబగునా?
తుందిలుఁడు సుఖముఁ గనునా?
గొంది నృపతిమార్గమగున? గువ్వలచెన్నా!

15


మిత్రుని విపత్తునందుఁ గ
ళత్రమును దరిద్ర దశను భ్రాతలగుణమున్‌
బాత్రాది విభక్తంబున
గోత్రను గనుగొనఁగవలయు గువ్వలచెన్నా!

16


అంగీలు పచ్చడంబులు
సంగతిఁగొను శాలుజోడు సరిగంచుల మేల్‌
రంగగు దుప్పటు లన్నియు
గొంగళి సరిపోల వన్న! గువ్వలచెన్నా!

17