పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాశ్చాత్య నాగరికతా వ్యామోహము నొందిన మనః ప్రవృత్తులను, ఆచార వ్యవహారములను ఈ శతక కర్త నిశితముగ విమర్శించెను. తిలకము జుట్టు త్యజించి తెల్ల యిజారు టోపీ ధరించి శ్వేతముఖులుగా రాణించుటకు యత్నించిన ద్విజులను, కుక్కలను పెంచి ప్రక్కలనిడి ముద్దాడి అనుదినము సబ్బునీటిచే కడుగువారిని కవి నానావిధములుగ మందలించెను. పాశ్చాత్య నాగరికత పట్ల తెలుగువారికి కలిగిన వైముఖ్యమును వెల్లడించిన స్థితి యిది.

కులస్త్రీలు నృత్య నాట్య సంగీత విద్యలను కులవిద్యలుగా నభ్యసించుట-వకీళ్ళ దుర్వర్తనము-పాశ్చాత్య నాగరికతా వ్యామోహము కవిత్వము-మున్నగు వానిని వస్తువుగ స్వీకరించుటలో శతకకర్త కొత్తదనమును చూపెను, చౌడప్ప 'పస' గల అంశముల నన్నింటిని ఒకచో చేర్చి చెప్పినట్లు ఈ శతకకర్త వివిధ ధ్వనులను వాని ఆధార స్థానములను ధ్వన్యనుకరణ పదముల కన్వయించి విపులముగ వివరించెను. కసకస రుసధుస కరకర-పరపర-గుడగుడ-బుడబుడ-లొడలొడ మున్నగునవి ఇట్టివి. కవిత్వమునకు సంబంధించిన విద్యల పరిస్థితిని సమీక్షించి సరస్వతి చర్యలు కూడ చిత్రవిచిత్రగతిని సొగుచుండునని కొన్ని పద్యములలో చిత్రించెను.

సూక్తిప్రాయములైన నీతులు అధిక్షేప, అర్థాంతరన్యాస, అన్యాపదేశ దృష్టాంతరీతిలో సాగినవి. పందిరి మందిరమగునా? తల పరువు నోరె చెప్పును, చెలమైన మేలు కాదా కులనిధి యంబోధికన్న అన్న పద్యభాగము లిద్దవి. బూతు పదముల నుపయోగించుటలో ఈ కవి చౌడప్ప నసుకరించినట్లు తోచును. అఖీ లార్థ ద్యోతకములగు ఈ పద్యములందు హాస్య అధిక్షేప చమత్కృతి కనిపించును. ఇటువంటి పద్యములు రెండు మూడు మాత్రమే కలవు.

గువ్వలచెన్న శతకకర్త కందపద్య రచనగూర్చి తనకు గల సామర్థ్యము నెచటను ప్రస్తావించలేదు. అయినను కందపద్యపు నడక, శైలి, రచనా విధానము-సూక్తి విన్యాసము ఈ కవికి గల సామర్థ్యమును నిరూపించుచున్నది.