పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విన్న వారికి హృద్యమై యున్న వాట
కన్న వారికిఁ జిత్రమై యున్న నాట
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!

42


కలిమెంత గలిగిన దొలఁగ వాపత్తులు
               తమ రెన్ని విధములఁ దన్నుకొన్న
తపమెంత గలిగిన తప్పదు కర్మంబు
               తోఁచక తమరెంత దుఃఖ పడిన
చదువెంత గలిగిన వదలదు దారిద్ర్య
               మూరకె తమ రెన్ని యూళ్ళుఁ జనిన
బలమెంత గలిగిన బాయవు వ్యాధులు
               తమరు నెన్నో యుపాయముల నున్న
యనుభవంబులు దప్పించు కొనఁగ శక్తి
గల్గునే స్వామి నీ యనుగ్రహము దక్క
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!

43


కలిమెంత యున్న బీదలఁదెప్పగా వద్దు
               విద్య యెంతున్న గద్దింప వలదు
ధనమెంత యున్న మత్తత వహింపఁగ వద్దు
               దొరతనం బెంతున్న త్రుళ్ళ వద్దు
వీర్యం బదెంతున్న విఱ్ఱవీఁగఁగ వద్దు
               తపమెంత యున్న క్రోధింప వలదు
బలమెంతయున్న దుర్బలు నదెంతన వద్దు
               ప్రజ్ఞ లెన్నున్నఁ జెప్పంగ వలదు
సాటిఁజెప్పిన యీమాట పాటి జేసి
యున్న మనుజులు బహుకీర్తి నొంద గలరు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!

44