పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోలంక శ్రీ మదనగోపాల శతకము

శ్రీకృష్ణ కేశవ చిన్మయానంద ము
               కుంద గోవింద వైకుంఠవాస
దేవనారాయణ దేవదేవ యనంత
               నరసింహ వామన గరుడగమన
క్షీరాబ్ధిశయన లక్ష్మీనాథ పుండరీ
               కాక్ష హృషికేశ యాత్మరూప
మధుసూదన త్రివిక్రమ జనార్దన పురాణ
               పురుష కౌస్తుభమణిభూషితాంగ
శంఖచక్రగదాఖడ్గసహితహస్త
పాహిమాం దేవ యని మిమ్ముఁ బ్రస్తుతింతు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!

1


గురుతరగౌతమగోత్రపవిత్రుండ
               ప్రధితవంకాయలపాటికులుఁడ
వేంకయమంత్రి సాధ్వీమణి కామమాం
               బాగర్భవార్థిజైవాతృకుండ
గుండు వేంకటరామ కోవిద గురుదత్త
               శుద్ధపంచాక్షరీసిద్ధియుతుఁడ
సకలలక్షణలక్ష్యసాహితీనిపుణుండ
               శైవవైష్ణవసదాచారరతుఁడఁ
వేంకటాఖ్యుడ నే జగద్విదితముగను
శతక మొనగూర్తు త్వ త్సమర్పితముఁ గాఁగ
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!

2