పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

అర్థాతురునకు గృత్యాకృత్యములు లేవు
            కవిజనంబుల కెఱుంగనివి లేవు
కుక్షింభరుఁడు కాని కూటికి రోయఁడు
            కామాతురుం డర్థకాంక్ష వీడఁడు
వెలిచవుల్గొను కాంత వెఱవదు నిందకు
            నీతకు మిక్కిలిలోతు లేదు
పాపశీలికి దయాపరత యెందును లేదు
            వెఱ్ఱివానికి సాధువృత్తి లేదు
మద్యపానుల కనరాని మాటలేదు
గ్రామ్యునకు గల్గదెందు నాగరికముద్ర
తప్పెఱుంగక పోవఁ డుత్తమకులజుఁడు
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

98


సీ.

ఎరువు నిత్యంబౌనె యిల్లౌనె పందిలి
            యిల నెండమావులు జలములౌనె
వరవు డిల్లాలౌనె పాపు బంటౌనె
            గులటతనూజుండు గొమరుఁడౌనె
మెఱపు దీపంబౌనె మేఘంబు గొడుగౌనె
            స్వాంగవాద్యంబులు తూర్యంబులౌనె
కంతి తలగడౌనె కల యథార్థంబౌనె
            పెనుదిబ్బ ముక్కాలిపీఁటయౌనె
గాని వస్తువుఁ బెట్టుకోఁ గాంక్షచేత
బెనఁగుమాత్రంబె కాని లభింపదేమి
దాని కొడఁబడఁ డింగితజ్ఞానశాలి
మదరిపువిఫాల మునిజనహృదయలోల
వేణుగోపాల భక్తసంత్రాణశీల!

99


సీ.

వేదశాస్త్రములు విన సొంపు లేదాయె
            సంగీతవిద్య బల్ చౌకనాయె
కవితారసజ్ఞత కలలోను లేదాయె
            బారమార్థికబుద్ధి భస్మమాయె