పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

రంగారాయచరిత్రము


ఉ.

ఆయతమౌక్తికగ్రథితహారమునం జెలువొప్పు విస్ఫుర
న్నాయకరత్న మట్లు సుమనస్తతి కెంతయు నగ్రగణ్యుఁడై
పాయక యంతరాయములఁ బాపు గజాస్యుఁడు రామమేదినీ
నాయకమౌళికిం గృప ననారతమున్ సమకూర్చు నిష్టముల్.

4


శా.

చాపంబున్ డమరు త్రిశూల శరముల్ శాతాసి ముఖ్యాయుధ
వ్యాపారంబునుఁ బాణిపంక్తులఁ దలిర్పన్ శాబరోద్వేలహే
లాపుంభావమునం జెలంగి విజయోల్లాసంబునం బొంగున
య్యీపూరీపురవీరభద్రుఁడు జయం బిచ్చుం గృతిస్వామికిన్.

5


శా.

వీణాపుస్తకముల్ కరాబ్జయుగళిన్ వెల్గొంద విద్వత్కవి
శ్రేణీజిహ్వలపై నటింపుచు రమాసీమంతినీరత్నశ
ర్వాణీముఖ్యసతీవతంసములకు న్వైదగ్ధ్యముల్ నేర్పున
వ్వాణీదేవి యొసంగు మత్కృతికి వాగ్వైచిత్ర్యమాధుర్యముల్.

6


తే.

కాళిదాసమయూరమాఘప్రభృతుల
నుతులఁ దేలించి యాంధ్రసత్కృతు లొనర్చు
నన్నపార్యుండు తిక్కన నాఁ దనర్చు
ప్రాక్తనకవీంద్రచంద్రులఁ బ్రస్తుతింతు.

7


ఉ.

నిబ్బరమైన యక్కరము నేర్చినవారలపోల్కె వట్టి త
బ్బిబ్బులు నాలుగల్లి తమభీకరవేషవిశేషపుష్టికై
యుబ్బి భ్రమల్గొనం గదిసి యొంటరిపాటున మూఢసన్నిధిం
డబ్బులుగొట్టు దుష్కవులు డాయఁగ నోపుదురే రసజ్ఞులన్.

8