పుట:2015.373190.Athma-Charitramu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 60

బరిణమించి పరమేశ్వరుని పరమపితగఁ జేకొందు రని రాజాగారు నేనును నొక్కి చెప్పితిమి. అగ్రాసనాధిపతియగు వెంకటరావు తన యుపన్యాసమున నిట్లు నుడివెను : - "మన మొనరింపఁబూనిన యీ సంస్కరణ మత్యంతలాభప్రద మైనదియే. కాని, మున్ముందుగ మనము మతగ్రంథములను పఠియించి, తోడిమతములగు క్రైస్తవమహమ్మదీయ మతములను బరిశోధించి, సమన్వయమునఁ దేలిన సత్యసిద్ధాంతములను జనులకు బోధింప నుపదేశికులను దేశమున పల్లెపల్లెకును, పట్టణపట్టణమునకును బంపినచో, హిందూమతపునరుద్ధరణము లెస్సగ జరుగఁగలదు." ఈమతప్రచారకార్యము తాను నేనును ప్రారంభింప విధిచోదిత మని యాతఁడు చెప్పినప్పుడు, నేనానందపరవశుఁడ నైతిని !

ఇట్లు రాజమహేంద్రవరమున రంగాచార్యులవారి యుపన్యాసముల ఫలితముగ, విద్యార్థులమగు మామనస్సులు అత్యంతోద్రేకపూరితము లయ్యెను. కృష్ణారావు, వెంకటరావు నేనును మతసంస్కరణాభినివేశ మను సుడిగుండమున నిపుడు పడిపోయితిమి. మా కిపుడు రేయింబవళ్లు సంస్కరణమునుగూర్చిన యాలోచనలతోనే కాలము గడచిపోయెను. 6 వ తేదీని మేము మువ్వురమును పాఠశాలకుఁ బోవుట మానివైచి, పోలవరము జమీందారుగారిమేడలోఁ గూడి, సంస్కరణ సంగతులు చర్చింతిమి. "మేము ప్రథమమున వేదములు మొదలగు హిందూమతగ్రంథములును, ముఖ్యపరమతగ్రంథములును నాలుగైదేండ్లు చదివి, మతవిషయములందు నిపుణులమై, అంతట రాజమంద్రి నివాసుల కేకీభావము గలిగించి, యచట సత్యమతమునకు శంకుస్థాపన మొనరించెదము. ఇచటనుండి చుట్టుపట్టులనుండు ప్రదేశముల కంత దేవునిసువార్త వెదజల్లి దేశోద్ధరణముఁ గావించెదము !" అని మేము నిర్ధారణ చేసికొంటిమి.