పుట:2015.373190.Athma-Charitramu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 56

గీతములును పాడుచుండిరి. ఆపుస్తకప్రతులు కొన్ని తెచ్చి మేము నుపయోగించుకొంటిమి. మాయిండ్లకుఁ జేరువనుండు మాధ్యమిక పాఠశాలాగృహమున మా సమాజప్రార్థనలు జరుపుకొనుచువచ్చితిమి.

నా కిపుడు సంఘసంస్కరణమే ప్రథానాశయ మయ్యెను. మిత్రులఁ గలసికొనినపుడు, వారలతో సంస్కరణావశ్యకతను గుఱించి యుద్రిక్తభావమునఁ బ్రసంగించు చుందును. నా దృష్టిపథమున సంస్కరణాభిముఖులు సజ్జనులు; తద్వ్యతిరేకులు కాపురుషులు, సంకుచితస్వభావులును ! నానాఁట నాసంస్కరణాభిమానము పలుకులు ప్రసంగములును దాటి క్రియాసోపానముఁ జేరెను. సంస్కరణపరాయణులు స్వేచ్ఛానువర్తనులుగ నుండవలయును. ప్రథమమున స్వగృహముననే వారు అనుష్ఠానమునకుఁ గడంగవలయును. ప్రకృతకాలమున పాఠశాలావిద్యార్థులలోఁ బలువురు కత్తిరించిన జుట్లతో నుండుట యాచారము. ఆకాలమున నగ్రవర్ణములం దట్టిపని కడు గర్హితము ! ఐనను, నాబోటి సంస్కరణాభిమాని జనాభిప్రాయములను లెక్కగొనక, ధైర్యమున నూతనపథము త్రొక్కవలదా ? తలనొప్పులు కనుల మంటలు నా కాకాలమున సన్నిహితబంధువులే ! కత్తితో క్షౌరమువలన నాకు నెత్తి మండుచుండెడిది. పుణ్యపురుషార్థము లిట్లు కలసిరాఁగా, నేను తలముందలి వెండ్రుకలు కత్తిరించుకొనుట కలవాటు చేసికొంటిని. క్రైస్తవులవలె నే నిట్లు తల పెంచుకొని, యింటను బైటను మనుజుల విపరీతవ్యాఖ్యానములకు గుఱి యైతిని. తల్లికి, తమ్ములకు, నౌకరులకు, తుదకు క్షురకర్మ చేయు మంగలికిని, నాచర్యలు విడ్డూరముగఁ దోఁచెను ! కాని, నేను స్థైర్యముఁ బూనియే యుంటిని.