పుట:2015.373190.Athma-Charitramu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15. రామభజనసమాజ సంస్కరణము 55

సికారాధన చేయ నభ్యాసపడిననే నంత రామభజనసమాజప్రణాళికను సంస్కరింప నుద్యమించితిని.

ఈవిషయమును జర్చించుటకై "రామభజనసమాజ" ప్రత్యేక సభ 6 వ అక్టోబరున జరిపితిమి. నా పూర్వసహపాఠి క్రొవ్విడి జగన్నాధరావు ఆసభ కగ్రాసనాధిపత్యము వహించెను. సంకుచితమగు పౌరాణికభజనము గాక, సర్వజనీనమును విశాలభావోపేతమునునగు మానసికారాధనము సలుపుటయె కర్తవ్య మని నే నానాఁడు దీర్ఘోపన్యాసము చేసితిని. పొరుగుననుండు పద్మనాభ మనువిద్యార్థి వ్యతిరకాభిప్రాయుఁడై, నాప్రతిపాదనమును ప్రతిఘటించెను. ఇరుకక్షల వారు నుద్రేక భావపూరితహృదయు లైరి. రెండుసమ్మతు లధికముగ వచ్చుటచేత నాతీర్మానము సభలో నంగీకరింపఁబడెను. నేను దిగ్విజయము చేసితి ననుకొంటిని. మఱునాఁటినుండియె మేము సమాజ పునరుద్ధారణమునకుఁ బూనితిమి. సత్యదైవమును నమ్మిన మాకూటమునకు "ప్రార్థనసమాజ" మని పే రిడితిమి. ఈ నూతనసమాజములో నాతో మిగుల తీవ్రముగఁ బనిచేసినవారు జగన్నాధరావు రాజగోపాలరావులు. పూర్వపు రామభజనసమాజమునకై వసూలు చేయఁబడిన సొమ్ము వారి కిచ్చివేయుటకు మేము సమ్మతింప లేదు. అందువలన నిరుకక్షలవారికిని పోరు ఘోర మయ్యెను. ఒకరిమనోభావముల నొకరు గేలి చేయసాగిరి.

మా నూతనసమాజవిధానమునుగుఱించి మే మంత తలపోయ సాగితిమి. నామిత్రుఁడు జగన్నాధరావు నన్నొక యాదివారమున కందుకూరి వీరేశలింగముగారు జరుపుచుండెడి ప్రార్థనసమాజసభకుఁ గొనిపోయెను. ప్రార్థనసమయమున నచట శ్రీ వడ్డాది సుబ్బారాయ కవికృత భగవత్కీర్తనములును, చెన్నపురి బ్రాహ్మసమాజమువారి