పుట:2015.373190.Athma-Charitramu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 44

బఱచుకొనవచ్చునని తలంచితిని. ఇది మంచిపనియె యని వెంకటరత్నముగా రనిరి. వెంకటరా విది విని యెగిరి గంతిడెను. అతఁ డిప్పు డీ తరగతిలోనే చేరనుండెను. కావున నేను 10 వ ఫిబ్రవరి తేదీని మా తండ్రిని వెంకటరత్నముగారి యొద్దకుఁ గొనిపోయి, నేను క్రిందితరగతిలోనే చేరుట కర్తవ్య మని యాయనచేఁ జెప్పించితిని ఆయనయెదుట మాతండ్రి సరే యన్నను, ఇంటికి వచ్చి మాతల్లితో నిది చెప్పి, నా మీఁదఁ గోపపడెను. ఇదివఱకే యొకయేఁడు నేను బడి యెగురఁగొట్టి, కొంటెతనమున మరల చదువులో వెనుకంజ వేయఁజూచుటకు వారు నన్ను నిందించిరి. నే నిట్టి కుతంత్రములు పన్నినచో, కుటుంబమును స్వగ్రామమునకుఁ దరలింతు నని మాతండ్రి చెప్పివేసెను !

కాని, నేను గట్టిపట్టు పట్టితిని. కళాశాలాధ్యక్షునియొద్దకు నేను జని, నాదేహస్థితి వారికి విన్నవించి, మరల మొదటితరగతిలోఁ జేరుదు నంటిని. గతసంవత్సరము నేను విద్య విరమించుటకె యచ్చెరువొంది యసమ్మతిఁ జూపిన మెట్కాపుదొర, నా క్రొత్తరాకడకు మఱింత విస్మయ మందెను. కాని, నాయనారోగ్యమునుగుఱించి మరల నే వొత్తిపలుకుటచేత, ఆయన తుట్టతుదకు, "వెంకటశివుడూ ! నీవు నాశిష్యులలో తెలివిగలవాళ్లలో నొకఁడ వని నే నెఱుఁగుదును. ఏధో కష్టము లేనిచో నీవంటివాఁడు క్రిందితరగతిలోఁ గూర్చుండుట యందలి నష్టావమానముల కొడంబడడు. నాకళాశాలలో నీయిష్టము వచ్చినతరగతిలో నీవు కూర్చుండవచ్చును. జీత మీయనక్కఱలేదు. ఇంకఁ బోయిరా !" అని చిఱునవ్వుతో నాకుఁ గళాశాలకుఁ బునస్స్వాగత మిచ్చెను !

నే నంత మొదటితరగతిలోఁ దిరిగి చేరితిని. కొలఁదిదినములలోనె యింటను విద్యాలయమునను నావింతపనిని గుఱించిన విస్మయ