పుట:2015.373190.Athma-Charitramu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. చర్వితచర్వణము 43

12. చర్వితచర్వణము

నా పూర్వగురువులగు మల్లాదివెంకటరత్నముగారిని గతసంవత్సరమున నపుడపుడు కలసికొనుచు, నా యారోగ్యమునుగుఱించి యాలోచనలు గైకొనుచువచ్చితిని. ప్రాత:కాలవ్యాయామము, శీతలోదక స్నానము, గోక్షీరపానమును, ఆరోగ్యప్రదము లని యాయన బోధించెను. ఆ డిశంబరు 26 వ తేదీని మా మామగారిసాయమున బొమ్మూరులో నొకయావును కొంటిమి. అది పూట కొకసేరు చిక్కని కమ్మని పా లిచ్చుచుండెడిది. స్నానపానాది దినకృత్యములు క్రమముగ జరుపుకొనుచు, 89 వ సంవత్సరారంభము నుండియు నేను మరల విద్యాభిముఖుఁడ నైతిని. జనవరిమూఁడవతేదీని నేను పుస్తకములు సవరించుకొని, చదువుసన్నాహము చేసితిని. ఇదివఱకే ప్రథమతరగతి పరీక్ష నిచ్చితిని గాన, జనవరి 21 వ తేదీనుండి రెండవ తరగతిలోనికిఁ బోయి కూర్చుండుచువచ్చితిని, గణితశాస్త్రాధ్యాపకులగు తంజావూరు సుబ్బారావు పంతులుగారు శిష్యులను పరియాచకము చేయు నభ్యాసము గలవారు. ఆయన నామీఁద ధ్వజ మెత్తినట్టు నా కిపు డగఁబడెను ! ఇదివఱకు విచ్చలవిడిగా వీధులఁ గ్రుమ్మరుచుంటిననియో, ఒకప్పుడు నేను తమ్మును వెక్కిరించితి ననియో, ఆయన నాపని నిపుడు పట్టించెను ! దేహస్వాస్థ్య మింకను గుదురక తికమకలఁ బడియెడి నాకిది ""పులిమీఁద పుట్ర" యయ్యెను. ఈయనదాడినుండి తప్పించుకొనుటకు నా కంత నొకయుపాయము తోఁచెను. కళాశాల మొదటితరగతి కీయనజోక్యము లేదు. మరల నే నం దేల చేరరాదు ? అట్లు చేసినచో, కొంతకాలము వీరిపోరు తప్పుటయెకాక, వెనుకఁబడి యుండిన ప్రాఁతనేస్తులతోఁ గలసి చదువు భాగ్యము గలిగి, తొందర లేనిచదువులో హాయిగ నింకొకయేఁడు గడిపి, యారోగ్యము చక్కఁ