పుట:2015.373190.Athma-Charitramu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 42

ఈసందర్భమున నింకొకసంగతికూడ గమనింపవలెను. లోకమున బాహాటముగ నలుగురిలోఁ దిరుగ నారంభించినపుడె, మానవ శీలము వికాసము నొందఁగలదు. వివిధపరిస్థితులశోధనకు లోనగునపుడె, మనప్రవర్తన దృఢపడుట కవకాశ మేర్పడును. నీరు చొరని యీఁత దుస్సాధ్యము. లోఁతునీటఁ బడి మున్కలు వేసి కాలుసేతులు కొట్టి తేలి తప్పించుకొనునపుడె యీఁతలోఁ బ్రవీణుల మయ్యెదము. నీతినియమములు లోకానుభవపుఁదాఁకుడునకు నిలిచి గట్టిపడినపుడె శీలసౌష్ఠవముగఁ బరిణమింపఁగలవు.

శూన్యము ప్రకృతివిరుద్ధ మని యాంగ్లలోకోక్తి. తగినంత వ్యాపృతి యుండినఁగాని మనస్సునకు స్వాస్థ్యసౌఖ్యము లనుభావ్యములు గావు. సంపూర్ణస్వేచ్ఛయు, స్వచ్ఛందగమనమును చేతస్సున కానందదాయకము లనుకొనుట వట్టివెఱ్ఱి ! ఏదో యొకసత్పధము త్రొక్కి, కార్యనిమగ్నత నొందునపుడె, మనస్సునకు నిజమగు హాయియు నెమ్మదియుఁ జేకూరఁగలవు. కార్యభరమున నుండువ్యక్తి నుండియె పాపచింతనలు పలాయిత మగుచుండును. ఇదియె యీలోకమున శాంతిసౌఖ్యములకుఁ గొనిపోవు ఘంటాపథము. తక్కినవి పెడదారులు, ముండ్లత్రోవలును.

గతసంవత్సరవిశ్రాంతివలన తల బొప్పిగట్టి, 1889 వ సంవత్సరారంభమున కళాశాలాశాంతిభవనమునే మరల నేను శరణుఁ జొచ్చితిని. శరీరమును రోగమునుండియు, మనస్సు నొడిదుడుకులనుండియుఁ దప్పించుకొనుటకుఁ బరిపూర్ణవిశ్రాంతి సాధనము గా దనియు, నియమపూర్వకవిద్యాభ్యాసము, నియమబద్ధజీవితమును పరమసాధనము లనియు నే నిపుడు గనుగొంటిని.