పుట:2015.373190.Athma-Charitramu.pdf/678

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 636

(12)

పరశువాకము, మద్రాసు, 22 వ తేది ఏప్రిలు 1904

ప్రియస్నేహితులకు, మీ ప్రేమపూర్వకమగు లేఖకును, పంపిన సొమ్మునకును, వందనములు.

1. నాచరిత్రమును గుఱించి: కొలఁదికాలములోనె నాకు మృత్యు వాసన్న మగునని నేను దలంచెదను. లాభకరమని యెంచినచో, మీరు నాజీవితచరిత్రము నామరణానంతరమె, వ్రాయవచ్చును. నేనింకను భూలోకమున చేయవలసిన పని యున్నదని తోఁచినతప్ప, కార్యపూర్తిచేసిన నన్ను దైవమిఁక పరలోకమునకుఁ గొనిపోవచ్చును. నేనింతకాలము జీవింతునని చిన్ననాఁ డనుకొనలేదు. నాకీచిరాయు వొసంగినందు కీశ్వరునికి కృతజ్ఞుఁడను. నేను సందేహించుచున్నను, నా "స్వీయచరిత్రము" ను వ్రాయుఁడని పలువురు నన్ను గోరుచున్నారు. నేను మీకొకసారి వ్రాసినట్టుగా, ఈవిషయమై కృషిచేతునని నేనంటిని. నావాగ్దానము నేను చెల్లించుకొనవలెను. రాబోవు వేసవిసెలవులలో నా సంగ్రహజీవితచరిత్రను వ్రాసి, మీకుఁ బంపెదను. నేను దినచర్యపుస్తకము లుంచలేదు. కాఁబట్టి నేను వ్రాయుదానివలన, మీయుద్యమమునకుఁ గొంతలాభము గలుగవచ్చును. మీ రది చదివినపిమ్మట, మీ కింకను సంగతులు కావలసినచో, అప్పడప్పుడు నాకు వ్రాయుచుండవచ్చును.

2. మీ "జనానాపత్రిక"ను గుఱించి: వలసినచో, నాముద్రాలయమున దాని నచ్చొత్తించి, అచ్చుచిత్తులు దిద్దిపెట్టెదను. చందా దారులకుఁగూడ పంపెదను. మీరే పత్రికాధిపత్యము వహింపవలెను.