పుట:2015.373190.Athma-Charitramu.pdf/674

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 632

(8)

"బ్రహ్మకృపా హి కేవలం"

సికందరాబాదు, 22 వ ఏప్రిలు 1902

ప్రియసహోదరా, అతి బాల్యముననే కాలగతి నొందిన తమ్ముని (సూర్యనారాయణను) గుఱించి, బ్రదికియున్న మనకు వేదనయు, హృదయపరితాపమును ! కొఱగానిదీపమె ప్రమిద యడుగు వఱకును కాలునట్లు కానబడును. కాని, అతనికిమాత్రము అది యింటి దెసకు పయనమె ! మంచి సువాసన లిచ్చు గులాబి, యజమాని పూజకై, కోయబడినట్టులె ! ఇట్టి తలంపునందె యోదార్పుగలదు. లేనిచో, యాలోచన కయోమయమును, భావనకు బాధాకరమును, అన్నిటికి నాటంకమును ! మనము శోకింపకుండ నుండలేము. దైవమును విశ్వసింపక తప్పదు. ఈశ్వరుఁడు మనకు శుభాశయములు పురిగొల్పునుగాక!

మీకు పరీక్షాధికారియుద్యోగము తప్పిపోయినది. దీనికి కారణమగు మీ శరీరాస్వస్థతకుమాత్రమె నావిచారము. బోధించుటయెగాని, పరిశోధించుట మీ విధ్యుక్తముగాదు. దయామయుఁ డగు సర్వేశ్వరుడు మీకు చిరాయు వొసగి, ధర్మపథమున నడిపించుఁగాక !

"సంఘసంస్కారిణీ" పత్రికలో ముద్రితమయిన బుచ్చయ్య పంతులుగారిని గుఱించిన మీలేఖ మద్రాసు సమాజసభ్యులలో గొందఱికి కష్టముగ నున్నది. కాని, మీవ్రాత సత్యమునుండి దూరస్థము గాదని నానమ్మిక.