పుట:2015.373190.Athma-Charitramu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 28

ఇది జరిగిన చిరకాలమునకుఁ బిమ్మట శర్మగారును నేనును రైలులోఁగలసికొంటిమి. అపు డాయన మద్రాసులో న్యాయవాదిగను, నేను బెజవాడలో నుపాధ్యాయునిగను నుంటిమి. "మీప్రస్తుతానుభవమునుబట్టి మీచిన్న నాఁటిచర్య వట్టి యల్లరిచేష్ట యని మీరం గీకరింపరా?" యని యాయన యడిగినప్పుడు, మే మిరువురమును నవ్వుకొని లోకవిశేషములు మాటాడుకొంటిమి !

8. స్నేహ సహవాసములు

మేము రాజమంద్రి చేరిన కొంతకాలమునుండి 1887 వ సంవత్సరమువఱకును, అప్పుడప్పుడు ఏకొలఁదిమాసములో తప్ప తక్కినకాలమంతయును, మాతండ్రి యుద్యోగఁపుఁబనుల మీఁద విదేశమున నుండుచువచ్చెను. మా రెండవమేనమామ తఱచుగ రాజమంద్రి వచ్చి, బజారునుండి వస్తువులు కొని తెచ్చి మా కిచ్చి స్వగ్రామము వెడలిపోవుచుండువాఁడు. కావున సంసారము నడిపి మా చదువుసాములు సాగించు భార మంతయు మాతల్లిమీఁదనే పడెను. పిల్లలలో నెవరికైన జబ్బు చేసినయెడల, ఆమె రాత్రి నిద్దుర మాని కూర్చుండును. ఇరుగుపొరుగున దొంగలు పడినయెడల, రాత్రు లామెకు కునుకు పట్టనేపట్టదు ! ఇట్టిబాధలు 1884 వ సంవత్సరము వేసవికాలమున మిక్కుటమయ్యెను. రాజమంద్రి వేసవిగడుపుట కనువగు ప్రదేశము కానేకాదు. దీనికిఁ దోడుగ, ఆయేఁట నెండ లతిశయించి యుండెను. పట్టణమున మశూచి ప్రబలెను. మేము భయపడినట్టుగనే, స్ఫోటకదేవత శీఘ్రమే మాయింట పీఠము వేసికొనెను. నాకుఁ జిన్న నాఁటనే మశూచకము గానిపించెనఁట. వెంకటరామయ్య తప్ప తక్కినపిల్ల లందఱికి నిపుడు స్ఫోటకము సోఁకెను. పాటెక్కువయై కొందఱు మిగుల