పుట:2015.373190.Athma-Charitramu.pdf/656

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 614

పై సభలలో నేను "అస్పృశ్యతానివారణము" ను గుఱించి నొక్కి చెప్పితిని. దీనికిఁ గారణము లేకపోలేదు. భ్రిటిషుదొరతనము వారు నూతనరాజ్యాంగసంస్కరణములందు అస్పృశ్యులకు ప్రత్యేక నియోజకవర్గము లేర్పఱుచుటవలన, ఇదివఱకు సాంఘికముగ జరిగిన కీడునకుఁ దోడుగ, ముందునుండి రాజకీయముగఁగూడ నస్పృశ్యుల కనర్థము గలుగుననియు, వారు హిందూసంఘమునుండి శాశ్వతముగ విడిపోవుదురనియును దలంచి, యీ యనర్థము హిందూదేశమునకు వాటిల్ల కుండుట కై తాను ప్రాయోపవేశము చేతు నని గాంధీమహాత్ముఁడు యరవాడ చెరసాలలో సెప్టెంబరు 20 వ తేదీనుండి నిరాహారదీక్ష నారంభించెను. గాంధిమహాత్ముని నిరహారదీక్ష దేశము నంతటిని కలవరపఱిచెను. దేశమునం దంతటను మహాసభలు జరిగి, తీర్మానములు గావింపఁబడెను. పునహాలో జరిగిన రాజీవలన నీవిషయమున దొరతనమువారు తమ నిర్ధారణమును గొంతవఱ కుపసంహరించుకొనిరి. గాంధిమహాత్ముఁడు 7 వ దినమున ఆహారము స్వీకరించెను. దేశమంతయు నంతట శాంతినొందెను.

ఆ సెప్టెంబరు 20 వ తేదీని దేశములో ననేకప్రదేశములందు వలెనే మాయింటఁగూడ మేము ముగ్గురమును ఉపవాసముచేసితిమి. నాకు పిలుపురాఁగా పురమందిరమున నస్పృశ్యతానివారణమును గుఱించి జరిగిన మిత్రులసభకు నేను బోయితిని. నాఁటిసభకు నే నధ్యక్షుఁడనయితిని. అస్పృశ్యత తొలఁగిపోవుటకై పంచములతోఁ గలసి భజనలు ప్రార్థనలు నూరేగింపులును జరుగుట యవశ్యమని మేము నిశ్చయించుకొంటిమి.

ఆమఱునాఁడె యువకులగు మా మిత్రులు కొందఱు పంచములను దీసికొని, అరండలుపేట బ్రాడీపేటలలోఁగల సర్కారుబావులను