పుట:2015.373190.Athma-Charitramu.pdf/655

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. హరిజనోద్యమము 613

పనియుండునపుడె, మనకు మఱింత పనిగలుగుచుండును. ఆ నెల తుది దినమున గుడివాడలో జరిగిన "కృష్ణామండల బోధకసమాజ" వార్షికసభకు నా కంత నాహ్వానము వచ్చెను. నే నచటి కేగి, నా పూర్వశిష్యులగు శ్రీ ఉప్పులూరి ఆదినారాయణమూర్తిగారి యింట బసచేసితిని. "విద్యాబోధకులకుఁ గొన్ని హితవచనములు" అను మకుటముతో నేనొక యాంగ్లవ్యాసము వ్రాసి, ఆసందర్భమునఁ జదివితిని.

ఇది జరిగిన కొలఁది దినములకే నా కింకొక దిశనుండి పిలుపు వచ్చెను. వేటపాలెమునందలి "సారస్వతనికేతనపు" జయంతోత్సవ సమయమున నన్నగ్రాసనాధిపత్యము వహింపుఁడని, ధర్మకర్తయగు శ్రీ. ఊ. వెం. శ్రేష్ఠిగారు కోరిరి., అంతియ కాక, యా సమయమున స్త్రీలసభ యొకటి జరుగునుగాన, దానికిఁగూడ నన్నే యేర్పాటులు చేయుఁడనిరి. కాఁబట్టి దసరా పండుగరోజున (9-10-32 ఆదివారము) నా భార్యయు, కొండ వెంకటప్పయ్యగారి రెండవ కొమార్తె పార్వతమ్మయును గలసిరాఁగా, నేను వేటపాలెము వెళ్లితిని. "ప్రస్తుత హిందూసంఘ పరిస్థితులు" అను నొక యాంధ్రవ్యాసము వ్రాసి, నేనా దినమున సభలోఁ జదివితిని. మఱునాఁటి స్త్రీలసభలో నాతో గుంటూరునుండి వచ్చిన యిరువురు స్త్రీరత్నములును నుపన్యాసము లిచ్చిరి. 11 వ తేదీని మే మందఱమును బాపట్లవచ్చి, బంధువగు సత్తిరాజు రామచంద్రరావుగారియింట బసచేసితిమి. స్త్రీలకొక యుపన్యాసమీయుఁడని శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మగారు కోరఁగా, "స్త్రీహితైషిణీ మండలి" సమాజసభలో "స్త్రీల ప్రస్తుతవిధులు" అను విషయమును గుఱించి నేను బ్రసంగించితిని. ఆరాత్రి రెయిలులో బయలుదేఱి, మేము గుంటూరు తిరిగి వచ్చితిమి.