పుట:2015.373190.Athma-Charitramu.pdf/654

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 612

కొలఁది మాసముల క్రిందటనే యొకపుత్రుని గోలుపోయి తాను జబ్బుపడి యిపుడె స్వస్థతఁ జెందుచుండు మఱఁదలు చామాలమ్మ రెండవకూఁతురు చంద్రమతి తన చిన్నకుమ్మాళ్లను వెంటఁబెట్టుకొని, గుంటూరువచ్చి, ఆగష్టునెలలో కొన్నిదినములు మాతోనుండెను. కాని, యధిక వర్షములచేతనో మఱి యేకారణమువనననో యామెకును, రెండవ పిల్ల వానికిని జ్వరము దగ్గును కలిగి, మిగుల బాధపడిరి. చేరువనుండు నొక వైద్యుని సాయమువలన వారికి స్వస్థత కలిగెను.

మా మఱఁదలు చామాలమ్మ ఆగష్టు 9 వ తేదీని నెల్లూరు కారాగృహమునుండి విడుదలయై, గుంటూరువచ్చి మాతోఁ గొన్ని దినములుండెను. కన్ననూరు నెల్లూరు కారాగృహములలో రాజకీయ ఖైదీలగు స్త్రీలు బాలికలు నెట్లు కాలము గడుపుచుండిరో యామె చెప్పెను. మిక్కిలి లేఁతవయస్సుననుండు స్త్రీలు సయితము తమ కష్టములను బొత్తిగ లెక్కసేయక, స్వదేశోద్ధరణమునుగుఱించి కారాగారముల కేగుచుండిరని యామె చెప్పెను.

మాపెరఁటిలో నిపుడు యానాదుల ఉటుంబము కాపుర ముండెను. వాండ్రకు మేమిచ్చెడిది నెలకు నాలుగు రూపాయిలె యయ్యును, వారుండుటవలన మాకు మిగులసౌఖ్యము గలిగెను.

ఈ సెప్టెంబరు 10 వ తేదీని నేను గుంటూరుమండలబోధక సమాజమువారి సంవత్సరోత్సవసందర్భమున "బోధకుల ప్రస్తుతకాల సమస్యలు" అను శీర్షికతో నొక యాంగ్లవ్యాసము వ్రాసి చదివితిని. మనదేశమున స్థానికప్రభుత్వసంస్థలు రాజకీయవిషయములందెకాక, విద్యావిషయములందును దేశమున దసంతృప్తిని గలిగించుచున్నవని నేను జెప్పితిని.