పుట:2015.373190.Athma-Charitramu.pdf/653

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. హరిజనోద్యమము 611

గ్రంథముగ నియమింపఁబడెను. కాని, చెన్నపురి విశ్వవిద్యాలయమున నాంధ్రవిద్యార్థులు మిక్కిలి తక్కువగ నుండుటచేత నాపుస్తక ప్రతులు కొలఁదిమాత్రమె యమ్ముడువోయెను.

1932 జులై మొదటితేదీని నాతమ్ముఁడు వెంకటరామయ్యయు, నరసింహము, నాపత్నియు వెంటరాఁగా, నేను గోదావరి పుష్కరమునకై రాజమంద్రి పోయి నదీస్నానముచేసితిని. జన సమ్మర్దము విశేషముగ నుండెడి యా పట్టణమున నుండుట కిష్టము లేక, ఆరాత్రియె మరల మేము భీమవరము వచ్చితిమి. పారిశ్రామిక ప్రదర్శనోత్సవ సందర్భమున రాజమంద్రిలో కోటిలింగములయొద్ద జరిగిన బహిరంగసభకు మేము పోయి, పలువురు ప్రాఁతనేస్తులను జూచితిమి. నాభార్య తన చెల్లెండ్రపిల్ల లను జూచుటకై కొవ్వూరులో దిగెను.

ఇటీవల నొకసంవత్సరము చదువు నిలిపివేసిన జనార్దనము మరల నిపుడు వైద్యవిద్యకొఱకు చెన్నపురి కేగెను. బి. యలు. పరీక్ష పూర్తిచేయుటకు నరసింహమును, యఫ్. యలు పరీక్ష తరగతిలో ప్రవేశించుటకు సుబ్బారాయఁడును చెన్నపురికి వెళ్లిరి. నేను జులై 17 వ తేదీని గుంటూరు వచ్చితిని. తన వృత్తి పనులతోపాటు కుటుంబపరిపోషణకార్యము నెఱపుచు తమ్ముఁడు వెంకటరామయ్య భీమవరములో నిలిచియుండెను.

ఈ మాఱు చదువుటకై నారాయణ యొక్కఁడు మాత్రమె గుంటూరు వచ్చెను. వానితోఁబుట్టువు లిరువురును రాలేదు. మాలతి చదువు మాట మఱచిపోయి, పుట్టినింట తన దుర్దశను జ్ఞప్తికిఁదెచ్చుకొని మరల వనటఁ జెందుచుండెనని మేమును, నా తమ్ములును దలంచి, ఆమెనుగుఱించి ఖేదపడితిమి.