పుట:2015.373190.Athma-Charitramu.pdf/650

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 608

ఆ వేసవిలో నా భీమవరముతాలూకాభూములు మూఁడింటిలో పాటిమన్ను పోయించి, వానిని బలపఱిచితిని. దీనికి చాలసొమ్ము వ్యయమైనను, ఆ భూములలో ముందు మంచిపంట పండఁగల దని నాయాశయము.

దుర్దశనొంది పుట్టినింట నుండు మాలతిని జూచివచ్చుటకై సుబ్బారాయనితో నే నీ వేసవి తుదిని వెలిచేరు పయనమైతిని. మార్గమధ్యమున నరసాపురములో మేము రెండురోజులు నిలిచి, అచట నిటీవల ప్రసవించిన మా తమ్ముఁడు కృష్ణమూర్తి మూఁడవకొమార్తె కామేశ్వరమ్మను, ఆమె చిన్ని తనయుని జూచితిమి. అచటినుండి మేము వెలిచేరు బయలువెడలితిమి. గత సంవత్సర మీరోజులలో సూర్యనారాయణయు నేనును వెలిచేరు ప్రయాణముచేసిన దినములసంగతి తలంపునకు వచ్చి, మేము శోకించితిమి. మమ్ముఁ జూచి మాలతి మిగుల విచారించెను. నాభార్య యిక్కడ కిటీవలనేవచ్చి, మాలతిని గుంటూరు కాహ్వానించెనఁట. దానిచెల్లెలు అచ్చమాంబ మాయొద్దనే యుండి యదివఱకు చదువు చుండెను. తప్పక గుంటూరు రమ్మని నేనును మాలతి నడిగితిని. మే మంత భీమవరము వెడలిపోయితిమి.

ఈ వేసవిలో భీమవరములోఁ బ్రసవమైన మాచెల్లెలి రెండవ కొమార్తె సీతమ్మయు దానిపిల్లలును, అక్క నరసమ్మయు దాని కుమారుఁడును, వేసవితుదిని తమతమ తావులకు వెడలిపోయిరి.

వేసవిచివర 24 వ జూను తేదీని నేనును భీమవరమునుండి బయలుదేఱితిని. దారిలో కైకలూరులో నేనొకరోజు నిలిచి, మఱఁదలి కుమారుఁడు కృష్ణారావును అతనిభార్యను పిల్లలను జూచితిని. మఱునాఁడు వెలిచేటి నారాయణతో బయలుదేఱి గుంటూరు చేరితిని.