పుట:2015.373190.Athma-Charitramu.pdf/643

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. నూతన పరిస్థితులు 601

'మురళీధరరావు', 'జానకీబాయి', 'మయూరశాస్త్రి' మున్నగు కథలు నే నప్పుడు వ్రాసినవియె.

ఆ వేసవి ప్రారంభము నుండియె, మరల దేశమున 'సహాయ నిరాకరణోద్యమము' ప్రారంభ మయ్యెను. గాంధీమహాత్ముఁడు దండి యాత్రకు వెళ్లి, 'లవణ సత్యాగ్రహము' నకు దిగుటయె తడవుగా, దేశమందలి ప్రముఖులు మరల కారాగార బంధితులుకాఁ జొచ్చిరి. ముఖ్యపట్టణములలో "శాంతిసైన్యముల" శిబిరము వెలసెను. 29 వ ఏప్రిలున మిత్రులు శ్రీ కొండ వెంకటప్పయ్యగారు రక్షకశాఖవారిచే అమ్మనబ్రోలు గొనిపోఁబడిరి. నేను వెంటనే వారి యల్లునితోఁ గలసి రెయిలెక్కి యాగ్రామమేగి, న్యాయసభలోనికిఁ బోయితిని. అపుడె న్యాయాధికారి వెంకటప్పయ్యగారికొక వత్సరము కఠినశిక్ష నొసఁగిరి. ఒకటి రెండు గంటలు వెంకటప్పయ్యగారితో నేను మాటాడి, గుంటూరు వెడలివచ్చితిని. ఆంధ్రప్రముఖులు శ్రీయుతులు టంగుటూరి ప్రకాశము, నాగేశ్వరరావు, సీతారామశాస్త్రిగార్లు మున్నగువారు సంతోషమునఁ గారాగారముల కేగిరి. మా చెల్లెలు కనకమ్మ నరసాపురములోను, మఱఁదలు శ్యామలాంబ ఏలూరులోను, సత్యాగ్రహసంస్థలో తీవ్రముగఁ బనిచేసిరి. ఆవేసవిలో నేను భీమవరములో నుంటిని. నాభార్య బెంగుళూరున కేగెను.

1930 వేసవిలో మాతమ్ముని కుమాళ్లు ముగ్గురు నపుడు ప్రబలియుండు సత్యాగ్రహమున దిగవలెనని మిక్కిలి ప్రయత్నించిరి. సూర్యనారాయణ భీమవరమునందలి యైచ్ఛికసైనికదళమునకుఁ గొన్ని దినములు కవాదుచెప్పెను. నేనును వెంకటరామయ్యయును వీండ్రను, మాచెల్లెలిని, సత్యాగ్రహముతో జోక్యము కలిగించుకొనవలదని హెచ్చరించితిమి.