పుట:2015.373190.Athma-Charitramu.pdf/640

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 600

యేలూరు వెళ్లితిమి. అచటినుండి మేము వెలిచేరువెళ్లి, మా బావమఱఁది రెండవకుమారుఁడు బుచ్చిరామయ్య వివాహమునకు పడవమీఁద ఆలమూరు వెళ్లితిమి. పెండ్లి లగ్నసమయమునందె యజీర్ణ ప్రకోపముచేత తలతిరిగి నేను క్రిందఁబడిపోయితిని ! ఐన నొక నిముసమునకే నాకు స్పృహవచ్చెను. ఆపెండ్లిలో కొందఱు ప్రాఁత నేస్తుల దర్శనము నాకు సంప్రాప్త మయ్యెను.

1930 వ సంవత్సరము ఫిబ్రవరినెలలో నాకు నెల్లూరు కళాశాలాధ్యక్షులగు శ్రీ మామిడిపూడి వెంకటరంగయ్యగారినుండి యాహ్వానము వచ్చెను. ఆకళాశాలా విద్యార్థి సంఘమువారి వార్షికసభకు నేనధ్యక్షత వహించితిని. నెల్లూరులోని మిత్రులను తోడి యుపాధ్యాయులను జూచి సంతోషమందితిని.

ఈ సంవత్సరము మార్చిలో మాచెల్లెలి కుమారుఁడు జనార్దనమునకు మాతమ్ముఁడు కృష్ణమూర్తి నాలుగవకొమార్తె మాణిక్యాంబ నిచ్చిపెండ్లిచేసిరి. ఆ సమయముననే కృష్ణమూర్తికుమారుఁడు బాలసూర్యునికి నుపనయనముకూడ జరిగెను.

12 వ యేప్రిలు తేదీని కొల్లూరులో పాఠశాలావిద్యార్థి సంఘమువారి వార్షిక సభకు నన్నగ్రాసనాధిపతిగఁ గోరిరి. విద్యాబోధకుల ముఖ్యవిధులను గుఱించి నేనా సమయమునఁ బ్రసంగించితిని.

శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు గారితో మాటాడుచు, నే నొక మాసపత్రిక ప్రకటింప నుద్దేశించుకొంటినని చెప్పఁగా అట్లు చేయుటకంటె, తమపత్రికలగు భారతి ఆంధ్రపత్రికలలో నే నెన్ని కథావ్యాసములనైన వ్రాయవచ్చునని వారు పలికిరి. అందువలన నే నప్పటినుండి కొన్ని నెలలు ఆంధ్రపత్రికకుఁ గథలు వ్రాయుచువచ్చితిని.