పుట:2015.373190.Athma-Charitramu.pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. తొలిదినములు 597

ఎటులైన నీ ధర్మమును దమపురమునకె దక్కునట్లు చేయఁగోరి, వా రెంతకాలమునకును మందిరమును ఖాళీ చేయకుండిరి ! నేను మందిరమునకు ధర్మకర్తనని యొప్పుకొనినచోఁ దాము వెడలిపోయెదమని వా రిపుడు వర్తమానమంపిరి ! నే నేమిచేయుదును? వారిమీఁద నే నిపు డభియోగము తెచ్చుట కొకవేయిరూపాయిలు కావలయునని న్యాయవాదులు చెప్పిరి ! కావున నెటులైన వారి నచటినుండి యంపి వేసి, "శాంతినిలయమును" పురధర్మకార్యములకు బాహాటముగ వినియోగింపఁగోరి, నేను వారికోరికచొప్పుననే చేసితిని. 18-1-29 వ తేదీని "శాంతినిలయము"ను గూర్చి నే నొక దస్తావేజు వ్రాసి రిజిష్టరి చేయించితిని. నా జీవితకాలమున నే నొక్కఁడను, పిమ్మట పురప్రముఖులలో మువ్వురును, దానికి ధర్మకర్తలుగ నుందురనియు, ఆ గృహము నిరర్థకమగునపుడు దాని నమ్మివైచి, ఆధనముతో నీ ధర్మమును బోలిన వేఱేదైన ధర్మమును జరుపవలెననియును నేను విధించితిని. అంత "సాహితీసంఘము" వారు తమ సామానుల నచటినుండి తీసికొనిపోయిరి. కొలఁదికాలమునకె యీ సంఘ మంతరించెను ! అప్పటినుండియు మందిరము నా యధీనమందె యున్నది. బహిరంగసభలు, ముఖ్యముగ స్త్రీల సమావేశములు నచట బాహాటముగ జరుపవచ్చును.

1928 డిశెంబరులో నేను వెంకటరామయ్యయును నెల్లూరు వెళ్లి, ప్రసవమై వ్యాధిగ్రస్తయైన యాతని పెద్దకోడలు సూర్యకాంతమ్మను జూచి వచ్చితిమి. ఆమెకుఁ ద్వరలోనె దేహస్వాస్థ్యము గలిగెను. అపుడు జనించిన యర్భకుని సంరక్షణమును గుఱించి వెంకయ్యగారును, వారి సతీమణియును మిగుల పాటుపడిరి.