పుట:2015.373190.Athma-Charitramu.pdf/636

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 596

బ్రవేశము గలిగించితిని. కాని, కొంతకాలమున కాసంస్థనిలిచి పోయెను. గుంటూరు "యువజనసాహితీసంఘము" వా రంత "శాంతి నిలయము"లోఁ దమ పుస్తకభాండాగారమును బెట్టుకొనుటకు నే నంగీకరించితిని. నేను నెల్లూరున నుండు చివరకాలమంతయు నేతత్సమాజమువారె "శాంతినిలయము" నుపయోగించుచు వచ్చిరి.

నే నిపుడు విశ్రాంతి గైకొనుటకై గుంటూరు వచ్చి చూచునపుడు, "శాంతినిలయమును" ఏతత్సమాజమువారు వాడుకొనక, ఎపుడును తాళము వేసియె యుంచుచు వచ్చిరి ! స్థలము విశాలమైనను, అందుఁ గట్టఁబడిన యిల్లు చిన్న దగుటచేత, అది యే పెద్దసభలకును బనికిరానట్టు నాకిపుడు స్పష్టమయ్యెను. ఇపు డది పెంపుచేయుటకు నాయొద్ద ధనములేదు. ఎందునకును కొఱగాని యిట్టి ధర్మశాల నుంచుటకంటె, దీనిని విక్రయించి యాధనమును "ఆంధ్రవిశ్వవిద్యాలయము" వారి కొసంగినచో, దానిమీఁద వచ్చువడ్డీతో వారు పేదవిద్యార్థులకు సంవత్సరవేతనము లిచ్చుచు, ధర్మము నిట్లు శాశ్వతసంస్థగ నడుపఁ గలరని మిత్రులు కొండ వెంకటప్పయ్యగారు నేనును దలంచితిమి. ఆంధ్రవిశ్వవిద్యాలయాధికారులతో నేనీ విషయమున నుత్తరప్రత్యుత్తరములు సాగించితిని.

ఈ సంగతి నేను "యువజనసాహితీసంఘము" వారి యుద్యోగులు కొందఱితోఁ జెప్పి వేసి, మందిరమును త్వరలో ఖాళీ చేయుఁడని కోరితిని. వారికిఁ దమ సంస్థను నడపుకొనుటయం దాసక్తి లేదుగాని, నా సంకల్పమునకు విఘాతము గలిగించుటకు వలయు శక్తి యుక్తులుమాత్రము లేకపోలేదు ! నా సొంతయుపయోగమునకై నే నీ మందిర మమ్మివేయ నెంచితినని వారు ప్రతీతి కలిగించి,