పుట:2015.373190.Athma-Charitramu.pdf/628

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 588

దైవానుగ్రహమున ముప్పదిరెండు సంవత్సరములు ఉపాధ్యాయునిగ నుండి, న్యాయపథము వీడక నా విధ్యుక్తములు నెరవేర్చి, ఇంత కాలమునకు విశ్రాంతి గైకొంటినని నే నమితానందభరితుఁడ నయితిని. నన్నూరు రూపాయిల మాసవేతనముతోఁ గూడిన కళాశాలాధిపత్యము, ఆయున్నతపదవి కనుబంధములగు నుపవేతనములు గౌరవోద్యోగము లన్నియు నంతరించెనని నా మనస్సున కిపు డావంతయు వంత లేదు ! రణరంగమునఁ బోరుసల్పి వచ్చిన సైనికుని వలెను, రంగస్థలమున నాట్యము ముగించిన పాత్రవలెను, నావిద్యాబోధకవృత్తి కార్యకలాప మితంటితో సంతృప్తికరముగ సమాప్తి చేసితినని నే నానందించితిని. నావిధ్యుక్తములు నే నెట్లు నెరవేర్చితినో నే జెప్పుటకంటె, నావిద్యాబోధనలాభ మందిన శిష్యసముదాయమును, నిరతము నాక్రియాకలాపమునకు సాక్షిభూతులుగ నుండిన సోదర బోధకవర్గమును ప్రస్తావించుట కర్హులు. దైవముఖముగఁ జూచియె నాపనులు నెరవేర్చితి నని నావిశ్వాసము. నా విద్యా విషయకమగు కృషి యూశ్వరార్పితమగుఁగాక !

స్వాగతపత్రికలు, వీడుకోలు వాక్యములును, భావోద్రేకపూరితము లగుటంజేసి, యుత్ప్రేక్షా ద్యలంకార భూయిష్ఠములుగ నుండును. ఐనను, ప్రయాణికుని కింటివారి సాగనంపుఁ బలుకులు పలుమాఱు జ్ఞప్తికి వచ్చి యాత్రయం దుత్తేజకములుగ నుండును. నా నెల్లూరు విద్యార్థులు వీడుకొలుపుసందర్భమునఁ జదివిన పత్రములలోని వాక్యములును, పద్యములును నా కీ సమయమున స్ఫురణకు వచ్చుచున్నవి. పొగడ్తల కన్నివిధములను నిఁక దూరస్థుఁడను గావలసినవాఁడ నయ్యును, వారి పలుకులఁ గొన్ని యిట నుదాహరించిన నాయహంభావత్వమును జదువరులు మన్నింతురు గాక !