పుట:2015.373190.Athma-Charitramu.pdf/627

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28. ఉద్యోగవిరామము 587

దేశప్రవాసముచేయుట యుక్తముగాదని నాభార్య పలుమాఱు నన్ను హెచ్చరించెను. నాశక్తియుక్తుల నిఁక గ్రంథరచనాది దేశహితైక కార్యములకు వినియోగించుట కర్తవ్యమనియు, కనీసము హాయిగ నేను విశ్రాంతి ననుభవింపవలసినతరుణ మిపుడు వచ్చెననియును నేను దలపోసితిని. కావున 1928 వ సంవత్సరము ఫిబ్రవరినెలలో నా పనికి రాజీనామా నిచ్చితినను కాకితమును కళాశాల కార్యదర్శి శ్రీ నరసింహాచార్యులుగారిచేత వేసితిని. ఇట్లు చేయవలదనియు, కనీస మిఁక రెండుమూఁడు సంవత్సరములు నేను కృషిచేసినచో కళాశాలా పరిస్థితులు చక్కపడుననియు ఆయన నొక్కిచెప్పెను. నేనందుల కియ్యకొనలేదు. పిమ్మట జరిగిన పాలకవర్గమువారి సభలోఁగూడ సభికు లిదేయభిప్రాయమును వెలువరించిరి. ఉద్యోగవిరామమె నాకు వాంఛనీయమని నేను గట్టిగఁ జెప్పితిని. పాలకవర్గమువా రంత దీనికి సమ్మతించి, నేను కళాశాలకుఁ జేసిన కృషి నభినందించుచు, తీర్మానము చేసికొనిరి. అంతట మెయి 1 వ తేదీని నేను కళాశాలాధ్యక్షతా భారమును కార్యదర్శి కొప్పగించి, నాసామానులు పుస్తకములును రెయిలులో పంపివైచి, సకుటుంబముగ గుంటూరునకు బయలు దేఱితిని.

జులై నెలలో నేను మరల నెల్లూరు సందర్శించితిని. అపుడు సెలవులలో జీతము గైకొనుట, కళాశాలాధికారు లిడు విందు నారగించుట, విద్యార్థు లొసఁగిన విజ్ఞాపనపత్రిక నందుకొనుటయును, నేను జరిపిన కార్యప్రణాళిక. ఎనిమిది వత్సరము లీ పురమున నివసించి, కన్నబిడ్డనువలెఁ గడు ప్రేమమున నీ కళాశాలను బెంచి, ఇపుడు నేను విశ్రాంతిని గైకొంటిని. నా శిరమునుండి హిమాలయ పర్వతమును బోలిన యొక మహాభారతము తొలఁగిపోయెను !